
చైనా చారిత్రక హక్కులు చెల్లవు
దక్షిణ చైనా సముద్ర వివాదంపై డ్రాగన్‌కు ట్రిబ్యునల్ షాక్
- చైనా చెప్తున్న చారిత్రక హక్కులకు ఆధారాలు లేవు
- ఏవైనా ఉన్నా ఐరాస ఒడంబడికతో చెల్లిపోయాయి: ట్రిబ్యునల్
- ఆ తీర్పు చెల్లదు.. ఆమోదించం.. గుర్తించం: చైనా
బీజింగ్/ద హేగ్ : అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను ఐక్యరాజ్యసమితి నియమిత అంతర్జాతీయ ట్రిబ్యునల్ మంగళవారం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై చైనా ఆగ్రహంగా స్పందించింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తిరస్కరించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతానికి పైగా ప్రాంతంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ పట్టుపడుతున్న చైనా వాదనకు ఎటువంటి న్యాయపరమైన ప్రాతిపదికా లేదని ద హేగ్ లోని ట్రిబ్యునల్ కొట్టివేసింది.
1940ల నాటి చైనా మ్యాప్ ఆధారంగా ‘నైన్-డాష్ లైన్’ పరిధిలో గల సముద్ర ప్రాంతంపై, అందులోని వనరులపై తనకు హక్కులు ఉన్నాయని చైనా ఉద్ఘాటిస్తుండగా.. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యూఎన్‌సీఎల్‌ఓఎస్)లో పేర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లకు.. చైనా చెప్తున్న హక్కులు విరుద్ధంగా ఉన్నాయని, చైనా చారిత్రక హక్కులేవైనా ఉంటే ఒడంబడిక ద్వారా అవి చెల్లిపోయాయని తీర్పులో స్పష్టంచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులను చైనా, ఇతర దేశాలకు చెందిన నావికులు, మత్స్యకారులు చారిత్రకంగా వినియోగించుకున్నప్పటికీ.. ఆ జలాలపై కానీ, వనరులపై కానీ చైనా చారిత్రకంగా ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు ఎటువంటి ఆధారం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. ఒడంబడికలోని 296వ అధికరణ, అనుబంధం 7లోని 11వ నిబంధన ప్రకారం ఇది తుది తీర్పు అని, చైనా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. తీర్పు సారాంశాన్ని మీడియాకు విడుదల చేసింది. స్పార్ట్లీ దీవుల వద్ద సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణం, ఇతరత్రా చర్యల వల్ల సముద్ర పర్యావరణాన్ని చైనా దెబ్బతీస్తోందని కూడా ట్రిబ్యునల్ తప్పుపట్టింది.
తీర్పు ప్రభావం ఏమీ ఉండదు: చైనా
ట్రిబ్యునల్ తీర్పుపై చైనా కఠిన వైఖరి అవలంబించింది. చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారం పైనా, దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాల పైనా ఈ తీర్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావం చూపబోదని.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకర్‌తో సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాలపై చారిత్రక వాస్తవాల ఆధారంగా, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నేరుగా ప్రమేయమున్న దేశాలతో శాంతియుత సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఆ సముద్రగర్భంలో అపార సంపద..!
దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఇప్పటివరకూ గుర్తించని చమురు, గ్యాస్, ఖనిజాల నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తల విశ్వాసం. అలాగే.. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన నౌకా మార్గాలు ఈ సముద్రం లోంచే వెళతాయి. ఈ సముద్రంలోని దీవులను తమ చక్రవర్తులు శతాబ్దాల కిందట కనుగొన్నారని, చరిత్ర అంతటా ఆ ప్రాంతంపై హక్కులు కలిగివున్నారని చైనా వాదిస్తోంది. అందులో కృత్రిమంగా దీవులు నిర్మించి, వాటిపై సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేస్తోంది. చైనా వాదనను ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూనై, తైవాన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ 2013లో సమితి శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టుకు ఫిర్యాదు చేయగా.. ఆ కోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు చెల్లదని, దానిని తాము అంగీకరించేది కానీ, గుర్తించేది కానీ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ బీజింగ్‌లో ప్రకటించింది.