బీజింగ్ : విమానంలో ప్రయాణించేవారు అప్పుడప్పుడు వింత చేష్టలకు పాల్పడుతూ తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరు తెలియకుండా తప్పు చేస్తే.. మరి కొందరు తెలిసి మరీ కావాలని చేస్తుంటారు. గతంలో ఓ మహిళ టాయిలెట్ డోర్ అనుకొని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి విమానం నిలిపివేసేలా చేశారు. అయితే ఆమె పొరపాటును ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసిందే కానీ.. కావాలని మాత్రం కాదు. కానీ తాజాగా ఓ చైనా మహిళ మాత్రం కావాలని విమానంలోని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి తోటి ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేశారు. విమానంలోకి గాలి రావడంలేదని, శ్వాసించడం కష్టంగా ఉందని ఏకంగా ఎమర్సెన్సీ తలుపులనే తెరిచారు. తోటి ప్రయాణీకులు వద్దని వారించినా వినకుండా అత్యవసర తలుపులను తెరచి విమానం గంట ఆలస్యంగా బయలుదేరేలా చేశారు. ఈ ఘటన చైనాలోని జియావో ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది.
ఈ నెల 23న వుహాన్ నుంచి లాన్జౌ వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ మహిళ వెళ్లి తన సీటులో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత తనకు ఉక్కపోతగా ఉందని, శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే తనకు చల్లగాలి కావాలనుకున్నారు. దానికోసం అత్యవసర తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు. తోటి ప్రయాణీకులు తెరవొద్దని హెచ్చరించినా వినకుండా డోర్ ఓపెన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ప్రయాణాన్ని రద్దు చేశారు. ఆమె చేసిన తతంగానికి విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment