వాతావరణ మార్పు కారణంగా 2025 నాటికి ప్రపంచవ్యాప్తం గా వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్థికంగా పెను ప్రమాదం ఎదుర్కోనున్న దేశాల్లో భారత్ సైతం ఉంది.
లండన్: వాతావరణ మార్పు కారణంగా 2025 నాటికి ప్రపంచవ్యాప్తం గా వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్థికంగా పెను ప్రమాదం ఎదుర్కోనున్న దేశాల్లో భారత్ సైతం ఉంది. ‘క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ అట్లాస్’ పేరుతో బ్రిటన్‌కు చెందిన మాప్లర్‌క్రాఫ్ట్ సంస్థ బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదికలో కీలకమైన ‘వాతావరణ మార్పు ముప్పు సూచీ’ ప్రకారం... వరదలు, తుపానులు, కరువు వంటి వాతావరణ మార్పు ప్రభావాల వల్ల 44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఉత్పాదకత ఉండే 67 దేశాలపై ప్రభావం పడనుందని అంచనా.
మొత్తం 193 దేశాల్లో ఆర్థికంగా అత్యంత తీవ్రంగా నష్టపోయే దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో నిలవగా.. భారత్ 20వ స్థానంలో, పాకిస్థాన్ 24వ స్థానంలో, చైనా 61వ స్థానంలో ఉన్నాయి. అలాగే వచ్చే 30 ఏళ్లలో తీవ్ర ఆర్థిక ప్రభావం పడే 50 నగరాల్లో ఢాకా, ముంబై, కోల్‌కతా, మనీలా, బ్యాంకాక్ నగరాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో పై-లీన్ తుపాను సృష్టించిన విధ్వంసం వాతావరణ మార్పు వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు ఉదాహరణగా నిలుస్తుందని నివేదికలో ప్రస్తావించారు.