
కలంతోపాటు కత్తి కూడా!!
• కొలరాడో టీచర్ల చేతిలో ఇక ఆయుధాలు
• ఉగ్రదాడుల నుంచి పిల్లలను కాపాడేందుకే..
• నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మిగతా పాఠశాలలు
డెన్వర్: వేయి కత్తులు చేయలేని పనిని ఓ కలం చేస్తుందంటారు. అందుకే కత్తికంటే కలం గొప్పదని చెబుతారు. కత్తి పట్టినవాడిని మార్చే శక్తి కలానికి ఉందంటారు. కానీ ఇవన్నీ ఒకప్పటి సమాజానికి సరిపోయే మాటలే. ఇప్పటి పరిస్థితుల్లో ఏది గొప్పదో చెప్పలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే ఉగ్రవాదులు పాఠశాలలపై విరుచుకుపడి.. అమాయకులైన చిన్నారులను బలిగొంటుంటే.. ఉపాధ్యాయులు నిశ్చేష్టుల్లా నిలబడిపోవాల్సి వస్తోంది. అందుకే కలంతోపాటు కత్తి ఉంటేనే మేలంటున్నారు అమెరికాలోని కొలరాడో జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు.
అంతేనా... పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తమ విద్యార్థుల రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం ఆయుధాలను కూడా వెంట తీసుకొచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయానికి ఇప్పటికే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఓటేశారు. అయితే ఆయుధాల వినియోగంపై ముందుగా శిక్షణ ఇచ్చిన తర్వాతే వాటిని పాఠశాలకు తీసుకెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇది స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన నిర్ణయంగానే ఉండాలని కోరారు. అయితే కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బడిపిల్లల్ని కాపాడేందుకు సాయుధులైన, శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుందని చెప్పారు.
మరికొంతమంది నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేవలం ఆయుధాలు ఉన్నంత మాత్రాన ఉపాధ్యాయులు తమ పిల్లల్ని కాపాడుకోలేరని, అందుకు వారికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. కొలరాడోతోపాటు టెక్సాస్, ఒక్లహోమా, కాలిఫోర్నియా జిల్లాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాగా కొలరాడోలోని కొన్ని పాఠశాలల బోర్డులు ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. భారీగా ఖర్చుచేసి, భద్రతా సిబ్బందిని నియమించుకోలేమని, తాము మాత్రం వచ్చే వార్షికోత్సవం నాటికి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తేల్చిచెప్పాయి.