డ్రగ్ కింగ్ ఇల్లా.. మజాకా?
డ్రగ్ కింగ్ ఇల్లా.. మజాకా?
Published Mon, Nov 21 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
తన తండ్రి బతికున్న రోజుల్లో తాను మహారాజులా ఉండేవాడినని, అప్పట్లో ఇంట్లో కాకుండా డిస్నీలాండ్లో ఉన్నట్లు అనిపించేదని అలనాటి డ్రగ్ కింగ్ పాబ్లో ఎస్కోబార్ కుమారుడు జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. కొలంబియా ప్రాంతంలోనే కాక యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్గా పేరొందిన ఎస్కోబార్.. తన ఇంటి పెరట్లో ఏనుగులు, జీబ్రాలు.. ఇలాంటి పెద్దపెద్ద జంతువులను కూడా పెంచేవాడట. 1993లో ఎస్కోబార్ మరణంతో అతడి డ్రగ్స్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది. అప్పుడు పేరు మార్చుకుని కొలంబియా వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నా జువాన్ మాత్రం అలా చేయలేదు. తన తండ్రి అంటే అతడికి అంతులేని ప్రేమ.
ఇంట్లో బోలెడన్ని ఏనుగులు, జిరాఫీలు, పెద్దపెద్ద మోటార్ సైకిళ్లు అన్నీ ఉండేవని, ఇక ఖర్చుపెట్టుకోడానికి డబ్బులైతే లెక్కలేనన్ని ఉండేవని జువాన్ చెప్పాడు. తండ్రి కోసం కావాలంటే తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడినన్నాడు. తన తండ్రిని ద్వేషించడానికి తనకు ఒక్క కారణం కూడా లేదని, ఎందుకంటే ఆయన ఏం చేస్తారో అప్పటికి తనకు సరిగ్గా తెలియదని వివరించాడు. ఈశాన్య కొలంబియాలోని మెడెలిన్ అనే పట్టణంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎస్కోబార్.. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా ఎదిగాడు. కొకైన్ స్మగ్లింగ్ ద్వారా దాదాపు వారానికి 2862 కోట్ల రూపాయలు సంపాదించేవాడు! డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచి మొదలుపెట్టి.. వేలాది హత్యలు చేయించడం, చివరకు ఒక విమానాన్ని కూడా పేల్చేసేవరకు తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. సంపాదించిన డబ్బులో చాలావరకు పేదలకు పంచిపెట్టేసేవాడు. దాంతో అతడిని కొలంబియా రాబిన్ హుడ్ అనేవారు.
పార్లమెంటుకు పోటీ చేయాలని భావించడంతోనే తన తండ్రి పతనం ప్రారంభమైందని జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. ఎన్నికల్లో పోటీ అంటేనే అందరి దృష్టి ఆయనమీద పడుతుందని, ఆ పని చేసి ఉండకపోతే ఇప్పటికీ తన తండ్రి బతికే ఉండేవాడని తెలిపాడు. చాలాసార్లు పోలీసు దాడులు, ఇతర గ్యాంగ్స్టర్ల దాడుల నుంచి తప్పించుకున్న ఎస్కోబార్.. చివరకు 1993 డిసెంబర్ రెండో తేదీన కొలంబియా పోలీసుల కాల్పులలో మరణించాడు. తన తండ్రి చనిపోవడానికి పది నిమిషాల ముందు కూడా ఆయనతో తాను మాట్లాడానని జువాన్ అన్నాడు. తండ్రి పోయిన ఆవేశంలో.. ఆయన వ్యాపారాన్ని తాను కొనసాగిస్తానని చెప్పినా, తర్వాత నిర్ణయం మార్చుకుని శాంతియుత జీవనం గడిపాడు.
Advertisement
Advertisement