బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకూ మొత్తంగా 563కు చేరుకుంది. కాగా, బుధవారం ఒక్కరోజే 73 మంది చనిపోయారు. ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయిన వారి సంఖ్య 28,018కు చేరుకుందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. దేశంలోని దాదాపు 31 ప్రావిన్సుల పరిధికి వ్యాధి విస్తరించిందని, బుధవారం మరణించిన 73 మందిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ హుబే ప్రాంతం వారని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 10రోజుల్లో ఆసుపత్రిని కట్టిన చైనా వుహాన్‌లో మరో ఆసుపత్రినికి కట్టింది. 1500 పడకలున్న ఈ ఆసుపత్రిలో త్వరలో వైద్యసేవలు ప్రారంభంకానున్నాయి. వుహాన్ సిటీ నుంచి ఢిల్లీకి చేరుకున్న 645 మందిలో ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వదంతులను సృష్టించారని కక్ష
వైరస్ వ్యాప్తిపై చైనా దేశ ప్రజలను అప్రమత్తం చేసిన ఎనిమిదిమంది వైద్యుల్లో ఒకరైన లీ వెన్‌లియాంగ్(34) చివరికి అదే వ్యాధితో కన్నుమూశారు. గత డిసెంబర్‌లో వుహాన్‌లోని వైద్య కళాశాలకు వచ్చిన రోగుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన ఈయన తన సన్నిహితులను అప్రమత్తం చేయడానికి వుయ్‌చాట్ ఆప్‌లో ఆ వివరాలను ఉంచారు. చివరికి ఆ మెసేజీ ద్వారా అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. దీంతో ప్రభుత్వం వదంతులను వ్యాపింపజేస్తున్నారంటూ లీపై కక్షకట్టింది. చివరికి డాక్టర్ లీకి కూడా ప్రాణాంతక వైరస్ సోకి పరిస్థితి విషమించడంతో వుహాన్‌లో కన్నుమూశారు.
కబళిస్తోన్న కరోనా వైరస్..
Published Fri, Feb 7 2020 3:40 AM | Last Updated on Fri, Feb 7 2020 3:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment