సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు పలు ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోన్న కోవిడ్-19 (కరోనా వైరస్) చైనాలోని వుహాన్‌లో బయటపడి సరిగ్గా నేటికి 41 రోజులు. ప్రాణాంతకమైన ఈ వైరస్ విస్తరించిన తీరును విశ్లేషిస్తే... ఇది మెర్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, సార్స్ వైరస్‌లకన్నా ప్రమాదకారిగా స్పష్టమవుతోందని లండన్ వైద్యాధికారులు తెలియజేస్తున్నారు.
ఎబోలా బయట పడిన 41వ రోజు నాటికి 243 మందికి, మెర్స్ బయటపడిన 41వ రోజు నాటికి 182 మందికి, స్వైన్ ఫ్లూ బయట పడిన 41వ రోజు నాటికి 500 మందికి, సార్స్ బయట పడిన 41 రోజు నాటికి 3,600 మంది వైరస్ బారిన పడగా, కోవిడ్ వల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా 81,400 మందికి విస్తరించింది. అంటే, మిగతా వైరస్‌లకన్నా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని స్పష్టం అవుతోంది. సార్స్‌ను నియంత్రించిన 2004 సంవత్సరం నాటికి ఆ వైరస్ బారిన 8,098 మంది పడగా, వారిలో 774 మంది మరణించారు. అంటే ఆ వైరస్ సోకిన వారిలో దాదాపు పది శాతం మంది మత్యువాత పడ్డారు. 2019, నవంబర్ నెల నాటికి మెర్సి బారిన 2,494 మంది పడగా, వారిలో 853 మంది మరణించారు. అంటే మతుల సంఖ్య దాదాపు 34 శాతం. (కోవిడ్-19 : ఫేస్‌బుక్ కొరడా)
కోవిడ్ వల్ల ఇప్పటి వరకు 81,400 మంది అస్వస్థులుకాగా, వారిలో 2,771 మంది మత్యువాత పడ్డారు. ఎబోలా, సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ వైరస్‌లకన్నా కోవిడ్ బాధితులే ఎక్కువగా ఉండడమే కాకుండా మృతులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్‌ను పరిశోధకులు కనుగొనలేకపోయారు. వైరస్ బాధితులకు దూరంగా ఉండడం, బయటకు వెళ్లి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించినప్పుడల్లా తప్పనిసరి చేతులను సబ్బు లేదా ఆల్కహాల్, ఇతర వైద్య శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కోవడమే ఉత్తమమని డాక్టర్ ఆల్మర్ సూచిస్తున్నారు. (కోవిడ్.. ఇక్కడ తగ్గి అక్కడ పెరుగుతోంది)
Comments
Please login to add a commentAdd a comment