వుహాన్/చైనా: కరోనా విజృంభణతో ప్రపంచ దేశాల్లో అపార ప్రాణ నష్టం సంభవిస్తుండగా.. వైరస్ పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో మాత్రం మరణాలు తక్కువగా నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు అన్ని దేశాలు చైనా ‘చావు’ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ నగర పాలక సంస్థ తాజాగా మరో 1,290 మరణాలు లెక్కలోకి చేర్చింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం తెలిపింది. దీంతో 50 శాతం పెరుగుదలతో వుహాన్‌లో మరణాలు 3,869కి చేరాయి. నిన్నటివరకు అక్కడ మృతుల సంఖ్య 2,579 గానే ఉంది. ఇక చైనా వాప్తంగా 39 శాతం పెరిగి మృతుల సంఖ్య 4,632కు చేరింది. అమెరికా ఆరోపణలు, ఇతర దేశాల ఒత్తిళ్ల నేపథ్యంలోనే తాజా లెక్కలు బయటికొచ్చాయని పులువురు విశ్లేషిస్తున్నారు.
(చదవండి: అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన చైనా)
అమెరికా ఆరోపణలు..
కోవిడ్-19 వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించి చైనా ప్రపంచం మీదకు వదిలిందని అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనాతో ప్రపంచ జనాలు పిట్టల్లా రాలిపోతుంటే.. చైనాలో తగ్గుముఖం పట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ సిటీలో ల్యాబ్‌లో సృష్టించారా అని నిగ్గుతేల్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైరస్‌పై తమకు తెలిసిన అంశాలతో చైనా నిజాయితీగా ప్రపంచం ముందుకు రావాలని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా కోరారు.
(చదవండి: డబ్ల్యూహెచ్‌ఓకి అమెరికా నిధులు కట్)
తాజా లెక్కలకు కారణమిదే!
2019 డిసెంబర్‌లో వుహాన్‌లోని ఫుడ్ మార్కెట్‌లో కోవిడ్ పుట్టుకొచ్చిందని చైనా స్పష్టం చేసింది. ప్రాణాంతక కోవిడ్‌ను లేబొరేటరీలో సృష్టించారన్న ఆరోపణలను డ్రాగన్ దేశం ఖండించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ల్యాబ్‌లో సృష్టించింది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజన్ గుర్తు చేశారు. వుహాన్ నగరంలో కరోనా అంతకంతకూ విజృంభించిన రోజుల్లో వేలాది కేసులు నమోదయ్యాయని, ఆసమయంలో వైద్య సిబ్బంది కేసుల నమోదులో నిర్లక్ష్యం వహించారని చైనాలోని ఎపిడెమిక్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ హెడ్‌క్వార్టర్స్ చెప్పింది.
వైరస్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో సరిపడా టెస్టింగ్, ట్రీట్‌మెంట్ సౌకర్యాలు లేకపోవడం కూడా కేసుల నమోదులో జాప్యానికి కారణమయ్యాయని, మరోవైపు వైరస్‌తో ఇంటి వద్ద మరణించిన బాధితుల సంఖ్య కూడా లెక్కల్లోకి రాలేదని వెల్లడించింది. అందువల్లనే ప్రస్తుత లెక్కలు వెలుగు చూశాయని పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నాటికి 21 లక్షల 80 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 1,46,897 మంది మృతి చెందారు.
(చదవండి: బోర్లా పడుకోబెడితే ప్రాణాలు దక్కుతున్నాయి!)
Comments
Please login to add a commentAdd a comment