ఆ పేరులోని పదాలన్నీ బుద్ధుడిని కీర్తించేవే
సాక్షి: 'ప్రపంచ మానవులందరం ప్రస్తుతం గొప్ప విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య పరస్పర
అవగాహన, భద్రత, సామరస్యం తప్పనిసరి. అవి లేకుండా శాంతియుత సహజీవనం సాగబోదు' అన్నారు దలైలామా. టిబెటన్ ఆధ్యాత్మిక గురువైన ఆయన ఈ ప్రసంగం చేసింది క్రైస్తవుల పుణ్యస్థలమైన వాటికన్‌లో. దలైలామా ప్రసంగాల్లో ఎల్లప్పుడూ శాంతి ప్రస్తావన ఉంటుంది. అందుకే ఆయనను శాంతి కపోతంగా గుర్తించింది ప్రపంచం..!
అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతల్లో 14వ దలైలామా ఒకరు. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి, అహింసా మార్గాల్లో టిబెట్‌కు స్వాతంత్య్రం సంపాదించేందుకు చేస్తున్న కృషికి ఫలితంగా ఈ బహుమతిని ప్రదానం చేశారు. ఆయన ప్రస్తుతం హిమాచల్‌లోని ధర్మశాల నుంచి తన శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
బాల్యం..
దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్‌గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశ ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ కుగ్రామంలో 1935 జూలై 6న జన్మించారు. రెండున్నరేళ్లకే బుద్ధుని అవతారంగా గుర్తింపుపొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు, తన వారసుడిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా.
జ్ఞాన సముద్రం..
టిబెటన్ భాషలో దలైలామా అంటే జ్ఞాన సముద్రం అని అర్థం. దలైలామా పూర్తి పేరు జెట్‌సన్ జంఫెల్ గవాంగ్ లోబ్సంగ్ యేషే టింజెన్ గ్యాట్నో. చాంతాడంత పొడవున్న ఈ పేరులోని పదాలన్నీ బుద్ధుని అవతారాన్ని కీర్తించేవే. పవ్రిత దైవం, దివ్య ప్రభ, సానుభూతి, విశ్వాస నిరూపక జ్ఞానసముద్రుడు అని అర్థం.
విద్యాభ్యాసం..
దలైలామా ఆరేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించారు. 25 ఏళ్లు వచ్చేవరకు బౌద్ధ మత సంప్రదాయ విద్యను అభ్యసించారు. బౌద్ధ మత తత్వశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా (గేషే లారంపా) పొందారు. బౌద్ధ విశ్వవిద్యాలయాలైన డ్రెఫండ్, సెరా, గండెన్ బౌద్ధ విద్యాలయాల్లో 30 మంది పండితుల పరీక్షలను నెగ్గి, 15 మంది పండితులతో బౌద్ధమత న్యాయసూత్రాలపై వాదించి, భౌతిక ఆధ్యాత్మిక విభాగాలలో నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
దలైలామాగా..
యేషేనారెబల్.. పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలనా వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే, 1954లో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం వారి హస్తగతమైంది.ఈ దశలో దలైలామా టిబెట్ పరిరక్షణ కోసం మావోసేటుంగ్ చౌ ఎన్‌లై వంటి నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మన దేశం ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా.
చైనా దుర్నీతిపై..
టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంపై ఐక్యరాజ్య సమితిలో దలైలామా ఫిర్యాదు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా మూడుసార్లు టిబెట్‌కు అనుకూలంగా ప్రతిపాదనలు చేసింది. అయినా చైనా తన దురాక్రమణ పర్వాన్ని ఆపలేదు. దలైలామా తయారు చేసిన టిబెట్ రాజ్యాంగాన్ని చైనా గౌరవించలేదు. 1980వ దశకంలో ఆయన ఎన్నో దేశాలు పర్యటించి, మద్దతు కూడగట్టారు. తుది ప్రయత్నంలో భాగంగా టిబెట్‌లో శాంతి స్థాపనకు 1987లో ఐదు అంశాల ప్రతిపాదన చేశారు.
ఇతర మతాలపై గౌరవం..
దలైలామా ఓ నిరాడంబర బౌద్ధ సన్యాసి. కచ్చితమైన నియమానుసారంగా బౌద్ధ మతాన్ని అవలంబించడంతో పాటు ప్రపంచంలోని ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తారు. ఆయన 1973లో క్రైస్తవుల రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ సిటీలో ఆరవ పోప్‌ను కలుసుకున్నారు. పోప్ రెండవ జాన్‌పాల్‌ని 1980, 82, 86, 88 సంవత్సరాలలో కలుసుకుని ప్రపంచ శాంతి గురించి చర్చించారు.
గాంధీజీ స్ఫూర్తి..
దలైలామా ఓ సందర్భంలో.. శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత గాంధీజీ అన్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సమయంలో దలైలామా, ‘‘ఈ పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వతంత్రంకోసం పోరాడేవారికి, అణగారిన వర్గాల వారికి, ప్రపంచ శాంతికి పాటుపడేవారికి ఈ బహుమతి అంకితం’’ అని వ్యాఖ్యానించారు.
పురస్కారాలు..
1959.. రామన్ మెగసెసె అవార్డు
1989.. నోబెల్ శాంతి బహుమతి
2012.. టెంప్లెటన్ ప్రైజ్
(ఈ అవార్డు కింద లభించిన మొత్తాన్ని మనదేశంలోని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థకు విరాళంగా ఇచ్చారు)
2007.. అమెరికా నుంచి
'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్'
2006.. కెనడా నుంచి గౌరవ పౌరసత్వం
2005.. యూకేలోని బుద్ధిస్ట్ సొసైటీ నుంచి క్రిస్ట్‌మస్ హంఫ్రీస్ అవార్డు.