లండన్: ఒక ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ముందుగా దాన్ని ప్రయోగించాలి. ఆ ప్రయోగం సఫలమైతేనే అది మార్కెట్లోకి వచ్చేది.. లేకపోతే దాన్ని మర్చిపోవాల్సిందే. మరి ఇలాంటి ప్రమాదకర ప్రయోగంలో భాగస్వాములు కావాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. దీపక్ పళివాల్.. భారత సంతతికి చెందిన ఇతను యునైటెడ్ కింగ్‌డమ్ వాసి. ఇతనితోపాటు వందలాదిమందిపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. చావు అంచుల దగ్గర ఉన్న వాళ్లు కూడా కోలుకునే అవకాశం ఉంది. (కరోనా అంతానికిది ఆరంభం)
కనీసం నా శరీరమైనా ఉపయోగపడుతుంది..
ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ప్రయోగం కోసం దీపక్ పళివాల్ స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. "ఏప్రిల్ 16న దీని గురించి తెలుసుకున్నా. తర్వాత ఏప్రిల్ 26న లండన్‌లో దీనికి సంబంధించిన కేంద్రాన్ని సందర్శించాను. అనంతరం నా నిర్ణయం గురించి స్నేహితులకు, భార్యకు చెప్పాను. కానీ నా భార్య దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ నేను వినిపించుకోలేదు. నా మెదడు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చేమో, కానీ నా శరీరం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనుకున్నా. అందుకే మరో ఆలోచనే లేకుండా మానవ ప్రయోగాలకు సిద్ధమయ్యా"నని తెలిపాడు. (ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ )
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినా..
హ్యమన్ ట్రయల్స్ వికటించి ఓ వ్యక్తి మరణించిన విషయాన్ని కూడా దీపక్ తెలుసుకున్నాడు. ఈ ప్రయోగాల వల్ల మరణించడం, అవయవాలు దెబ్బతినడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తెలిసినా వెనకడుగు వేయలేదు. అల్లల్లాడిపోతున్న మానవజాతిని కబళిస్తోన్న కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ తయారీలో తనవంతు భాగస్వామ్యం అయ్యాడు. తనపై ట్రయల్స్ పూర్తవగానే క్షేమంగా ఇంటికి చేరుకోవడం చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా దీపక్ పళివాల్ రాజస్థాన్‌లోని జైపూర్ వాసి. అతను తన భార్యతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి (కలిపి కొడితే కరోనా ఫట్?)
Comments
Please login to add a commentAdd a comment