పెరిగిన స్వాతంత్య్రేచ్ఛ
రెఫరెండం.. నేపథ్యం!
స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రాన్ని నిర్ణయించే రెఫరెండంకు దారి తీసిన పరిస్థితులు...
మధ్య యుగాల్లో స్కాట్లాండ్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. క్రీశ 14వ శతాబ్దంలో ఇంగ్లండ్ రాజ్యంతో పలు ‘స్వాతంత్య్ర యుద్ధాలు’ కూడా చేసింది. 1707లో ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ రాజ్యాలు కలిసిపోయి ‘కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’గా ఏర్పడ్డాయి. 1801లో ఐర్లాండ్ రాజ్యం విలీనం అయిన తరువాత అది ‘యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)’గా మారింది. తరువాత సంక్షేమ రంగం, పన్నుల వ్యవస్థ, నిధుల కేటాయింపు.. తదితరాల్లో బ్రిటన్ ప్రభుత్వ వివక్షతో స్కాట్లాండ్ ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. స్కాట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ 1934లో స్కాట్లాండ్ నేషనల్ పార్టీ(ఎస్‌ఎన్‌పీ) ఆవిర్భవించింది. ఆ పార్టీ ఒత్తిడిపై స్కాట్లాండ్ చట్టం, తద్వారా 1999 లో స్కాటిష్ పార్లమెంటు ఏర్పడ్డాయి. 2007 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి సంబంధించిన రెఫరెండం నిర్వహిస్తామంటూ ఎస్‌ఎన్‌పీ హామీ ఇచ్చింది. అప్పుడు అలెక్స్ సాల్మండ్ ఫస్ట్ మినిస్టర్‌గా మైనారిటీ ప్రభుత్వం ఏర్పడటంతో ఎస్‌ఎన్‌పీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. 2011 ఎన్నికల్లో మరోసారి అదే హామీతో ఎస్‌ఎన్‌పీ ప్రజల ముందుకు వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎస్‌ఎన్‌పీకి పూర్తి మెజారిటీ రావడంతో రెఫరెండానికి మార్గం సుగమమైంది. అనంతరం స్కాట్లాం డ్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరి, 2013లో రెఫరెండానికి రాజ ముద్ర లభించింది.
విడిపోవడం ఎందుకు?
బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్‌లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు.
యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్‌లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి.
కలసి సాగడం ఎందుకు?
విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్‌కు అవసరమని వాదిస్తున్నారు.
నేషనల్ డెస్క్