అవును.. పన్ను చట్టాలతో లబ్ధి పొందా: ట్రంప్
పన్ను చట్టాలలో ఉన్న లొసుగులను తాను తెలివిగా ఉపయోగించుకున్నానని, వాటివల్ల తాను పెద్ద మొత్తంలోనే లబ్ధి పొందానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఒప్పుకొన్నారు. తాను పన్ను చట్టాల వల్ల ప్రయోజనం పొందానని అంగీకరించారు. చట్టాలను తాను చాలా తెలివిగా ఉపయోగించుకున్నానని, అయితే తాను గెలిస్తే మాత్రం ఈ చట్టాలను మారుస్తానని ఆయన అన్నారు. ''మన పన్ను చట్టాలలోని అనుచిత వైఖరిని నమ్మలేం. నేను ఈ విషయం గురించి చాలాకాలంగా చెబుతున్నాను. కానీ ఈ చట్టాల వల్ల నేను చాలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందాను'' అని ట్రంప్ చెప్పినట్లు ఎఫీ న్యూస్ తెలిపింది. కొలరాడో ప్రాంతంలో నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయనీ విషయం వెల్లడించారు. పన్ను చట్టాల్లో ఉన్న సంక్లిష్త ఇతరుల కంటే తనకు బాగా తెలుసని, తాను వాటివల్ల లబ్ధి పొందానని, ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే మాత్రం వాటిని సవరిస్తానని ఆయన చెప్పారు.
పన్ను చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని.. ట్రంప్ వీలైనంత తక్కువగా పన్నులు చెల్లించారంటూ ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఇది ఒక్కసారిగా సంచలనం రేపింది. ఒక వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా తాను పన్ను చట్టాలను తన ప్రయోజనం కోసం చట్టబద్ధంగా ఉపయోగించుకున్నానని, తన కంపెనీ కోసం, తన ఉద్యోగుల కోసం అలా చేశానని ట్రంప్ చెప్పారు. అయితే కథనం వచ్చిన రెండు రోజుల తర్వాత గానీ ట్రంప్ ఏ వేదిక మీదా దానిపై స్పందించలేదు. ఎట్టకేలకు ఆయన విషయాలు బయటకు చెప్పడంతో ఇప్పుడు దాని ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందోనని అంతా చూస్తున్నారు. తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా చట్టాన్ని అమలుచేస్తూ డబ్బు సంపాదిస్తే.. హిల్లరీ మాత్రం రాజకీయాల్లో అవినీతికి పాల్పడ్డారని, చట్టాన్ని ఉల్లంఘించి తన ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టేశారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.