'అతడికి నేనంటే ఇష్టమో.. కాదో'
న్యూయార్క్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే అమెరిక అధ్యక్ష పదవి కోసం నామినేషన్ అర్హత దాదాపు సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి కాస్త నెమ్మదించి మాట్లాడారు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యర్థి టెడ్ క్రూజ్ను వెనక్కి నెట్టిన ట్రంప్.. క్రూజ్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఎన్నో పోటీలు ఎదుర్కొన్నానని, తమ పార్టీ తరుపునే బరిలోకి దిగిన క్రూజ్ గట్టి పోటీ ఇచ్చాడని అన్నారు.
'నా జీవితమంతా పోటీల మయం. ఎన్నో పోటీలు దిగ్విజయంగా ఎదుర్కొన్నాను. భిన్న పోటీలు నా జీవన ప్రయాణంలో చూశాను. కానీ, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టెడ్ క్రూజ్... అతడు నన్ను ఇష్టపడతాడో లేదో నాకు తెలియదు. కానీ పోటీ దారుల్లో మాత్రం అతడు మేటి. అతడితో కాంపిటేషన్ చాలా టఫ్.. బాగా తెలివైన వాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను అతడికి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అతడి ముందున్న పరిస్థితి కొంత కఠినమైనది. నిజంగానే కఠినమైనది. టెడ్, హైదీ ఆయన కుటుంబం మొత్తం బాధపడుతూ ఉండొచ్చు. ఒక విషయం మాత్రం చెప్పగలను. అతడిని ఎదుర్కోవడం మాత్రం నిజంగా చాలా కష్టమే.. గొప్ప పోటీదారు క్రూజ్' అంటూ ట్రంప్ చెప్పాడు. నవంబర్ లో అధ్యక్ష పీఠం తమ వశమవుతుందని, అమెరికా నెంబర్ 1 అవుతుందని చెప్పారు. ఇక కంపెనీల వ్యవహారాలన్ని మూసేసి తాను దేశ సేవకు అంకితం అవుతానని ట్రంప్ చెప్పారు.