అధ్యక్ష పదవికి రూట్ క్లియర్ చేశాడు
ఇండియానాపొలిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందేందుకు బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. ఇండియానాలో కూడా ఆయన పై చేయి సాధించారు. ఇక్కడ తనకు గట్టి పోటీ దారుడైన టెడ్ క్రుజ్ను మట్టి కరిపించి నామినేషన్ తన పేరిట ఖరారు చేసుకున్నారు. ఈ ఎన్నికలతో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి తానే అనే ట్రంప్ నిరూపించుకున్నాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ట్రంప్ ఈ విజయం సాధించడం గమనార్హం.
మరోపక్క, డెమోక్రటిక్ పార్టీ తరుపున నామినేషన్ కోసం పోటీ పడుతున్న శాండర్స్, హిల్లరీ క్లింటన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు హిల్లరీదే పై చేయి ఉండగా ఇండియానా ఎన్నికల్లో శాండర్స్కు అత్యధిక ఓట్లు లభించాయి. ఇండియానాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్కు 481573 ఓట్లు రాగా.. టెడ్ క్రూజ్ కు 336492, శాండర్స్ కు 259341, హిల్లరీ క్లింటన్ కు 227693 ఓట్లు వచ్చాయి.
ఈ విజయం సాధించిన సందర్భంగా బిజినెస్ టైకూన్ అయిన ట్రంప్ తన కుటుంబ సభ్యులు బంధువుల కుటుంబ సభ్యులతో కలిసి వేదికపై నడుస్తూ మీడియాతో మాట్లాడారు. 'హిల్లరీ గొప్ప అధ్యక్షరాలు కాలేదు.. ఆమె మంచి అధ్యక్షురాలు కూడా కాలేదు, ఆమె ఒక బలహీనమైన అధ్యక్షురాలిగానే ఉంటారు. ఆమెకు వర్తకం అంటే అసలే అర్థం కాదు' అంటూ చురకలు అంటించారు. జూన్ 7న ట్రంప్ తన నామినేషన్ వేయనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి.