ట్రంపే రిపబ్లికన్ అభ్యర్థి!
♦ ఇండియానాలో గెల్చిన ట్రంప్, ఓడిన హిల్లరీ
♦ రిపబ్లికన్ రేసు నుంచి తప్పుకొన్న క్రుజ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. ప్రైమరీ రేసులో మాత్రం అనూహ్యంగా ముందుకెళ్తున్నారు. మంగళవారం ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇండియానాలో ఓటమి పాలైన టెడ్ క్రుజ్ రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
బలమైన ప్రత్యర్థి అయిన క్రుజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి ట్రంప్‌కు మార్గం సులువైంది. రేసులో ఇంకా ఓహియో గవర్నర్ కాసిచ్ ఉన్నప్పటికీ ఆయన ట్రంప్‌కు పోటీగా నిలిచే పరిస్థితి లేదు. అయితే జూన్ నెల వరకు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పుడే అధికారిక ప్రకటన వెలువడుతుంది. తాజా విజయంతో 1,047 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. మేజిక్ నంబర్‌కు చేరుకోవాలంటే మరో 190 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఒకప్పటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు, ఇండియన్ అమెరికన్ బాబీ జిందాల్ ట్రంప్‌కే తన ఓటు అని ప్రకటించారు.
హిల్లరీ నామినేషన్ ఆశలు పదిలం
మరోవైపు డెమోక్రాటిక్ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ.. ఇండియానాలో ఆమె ప్రత్యర్థి బెర్న్ శాండర్స్ చేతిలో ఓటమి పాలయ్యారు. రేసులో బాగా వెనుకంజలో ఉన్న శాండర్స్ ఈ విజయం సాధించినా హిల్లరీ డెమోక్రాటిక్ నామినేషన్‌కు ఢోకా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.