ట్రంప్ నోట మళ్లీ ‘హెచ్1బీ’
ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎక్కుపెట్టిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలో మళ్లీ ప్రచారాస్త్రంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీటిని తెరపైకి తెస్తున్నారు. వర్క్ వీసాల పేరుతో కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా తల్లుల్లో చాలా మంది తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోనని ఆందోళనపడుతున్నారని, కాలేజీ విద్యార్థులకు అతిపెద్ద ముప్పు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలేనని పేర్కొన్నారు.
హెచ్1బీ వీసాలతో చాలా కంపెనీలు తక్కువ వేతనానికే విదేశీయులను దిగుమతి చేసుకుని కాలేజీల్లో చదువుతున్న అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్1బీ వీసాలను ఎక్కువగా ఐటీ రంగం వారే దక్కించుకుంటున్నారని, వారిలో ఎక్కువ మంది భారతీయులేనన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందిస్తూ.. వాస్తవానికి తానే బాధితుణ్నని, తనపై డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ కుట్రపన్నారని ఆరోపించారు. మహిళలపై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను క్షమించలేమని దేశాధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషల్ పేర్కొన్నారు.
హిల్లరీకే 72 శాతం ముస్లింల మద్దతు!
ప్రతి పదిమంది అమెరికన్ ముస్లింలలో ఏడుగురు హిల్లరీకే ఓటేస్తామని చెప్పినట్లు ఓ సర్వేలో తేలింది.