లైంగికంగా వేధించారు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా ఐదుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన వ్యాఖ్యల ద్వారా తలెత్తిన వివాదాలతో సతమతమవుతున్న 70 ఏళ్ల ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికలకు నిండా నెలరోజుల వ్యవధి కూడా లేని సమయంలో.. తాజా ఆరోపణలు వచ్చి మీద పడడంతో మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది.
మహిళల గురించి అభ్యంతరకరంగా ట్రంప్ మాట్లాడిన 2005 నాటి వీడియో విడుదలైన కొద్దిరోజులకే కొత్తగా ఈ ఆరోపణలు రావడం గమనార్హం. మూడు దశాబ్దాల క్రితం తాను విమానంలో ట్రంప్‌తో కలసి ప్రయాణించానని, అప్పుడు ఆయన తనను అసభ్యంగా తాకినట్టు జెస్సికా లీడ్స్ అనే 74 ఏళ్ల మహిళ తెలిపారు. ట్రంప్ టవర్‌లోని ఓ సంస్థలో 2005లో తాను పనిచేసినప్పుడు లిఫ్ట్‌లో ట్రంప్‌తో కలసి వెళుతుండగా ముద్దు పెట్టుకున్నారని రిచర్స్ క్రూక్స్ అనే మహిళ వెల్లడించారు.
13 ఏళ్ల క్రితం ఒక వేడుక సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని మెక్‌గిల్లివ్‌రే(36) అనే మహిళ తెలిపారు. 2005లో ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు తనను ట్రంప్ ముద్దు పెట్టుకున్నారని జెన్నిఫర్ మర్ఫీ అనే మరో మహిళ సైతం ఆరోపించారు. అయితే మహిళల కథనాలను, న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్రంప్ ప్రచార శిబిరం కొట్టిపడేసింది.