
వాషింగ్టన్ : అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వెలుగుల పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులకు తనతో పాటు భార్య మెలానియా ట్రంప్ తరఫున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కాగా ఓవల్ కార్యాలయంలో కొంతమంది ఇండో అమెరికన్ల సమక్షంలో ట్రంప్ దీపావళి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాలో నివసించే ప్రజలు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పండుగలు జరుపుకొనే అవకాశం తమ దేశ రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ మేరకు ప్రతీ మతస్తుడి హక్కులను కాపాడుతూ.. తమ మత ఆచారాలను మరింత గొప్పగా పాటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక దీపావళి గురించి మాట్లాడుతూ... ‘ఈ పర్వదినం నాడు ఆయా మత సంప్రదాయాలు పాటించే వారు తొలుత పూజ చేస్తారు. ఆ తర్వాత దీపాలు వెలిగించి కాంతులు వెదజల్లుతారు. సంప్రదాయ వంటకాలతో భోజనం చేసి బంధువులు, స్నేహితులతో పండుగను గొప్పగా జరుపుకొంటారు. అమెరికా, ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకొనే వారందరికీ శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యానించారు. ఇక గత కొన్నేళ్లుగా అమెరికా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment