వీసాలపై భారత్కు మరో ఎదురుదెబ్బ
వీసాలపై భారత్కు మరో ఎదురుదెబ్బ
Published Tue, Apr 18 2017 1:45 PM | Last Updated on Tue, Aug 7 2018 4:20 PM
హెచ్-1బీ వీసాల కఠినతరంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఒక వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు 9,50,000 మంది తాత్కాలిక విదేశీ వర్కర్లు వాడుతున్న 457 వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా మంగళవారం పేర్కొంది. ఈ ప్రభావం భారతీయులపై ఎక్కువగా పడనుందని తెలుస్తోంది. తాత్కాలిక విదేశీ వర్కర్లుగా ఆస్ట్రేలియాలో పనిచేసే వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నట్టు తెలిసింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగుల కొరత ఉన్నప్పుడు, ప్రతిభావంతమైన ఉద్యోగాల్లో నాలుగేళ్ల పాటు విదేశీ వర్కర్లను నియమించుకునేలా 457 వీసా ప్రోగ్రామ్ ను ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది.
''మాది వలస దేశం. కానీ ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో కచ్చితంగా మా వర్కర్లకే ప్రాధాన్యమివ్వాలి. ఆ కారణం చేతనే 457 వీసాను రద్దు చేస్తున్నాం. ఈ వీసా తాత్కాలిక విదేశీ వర్కర్లను మా దేశంలోకి ఆహ్వానిస్తోంది'' అని ప్రధానమంత్రి మాల్కం టర్న్బుల్ చెప్పారు. ఈ వీసాపై ఆధారపడి అత్యధిక సంఖ్యలో భారతీయులు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు. భారత్ తర్వాత, యూకే, చైనా నుంచి వచ్చివారు ఇక్కడ ఉద్యోగవకాశాలు పొందుతున్నారు. ఇక తాము ఎట్టిపరిస్థితుల్లో 457 వీసాలను అనుమతించబోమని ప్రధాని తేల్చిచెప్పారు. కొత్త నిబంధనలతో మరో కొత్త వీసా ప్రోగ్రామ్ తీసుకురానున్నట్టు ప్రధాని ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ ప్రతిభావంతులైన, నిపుణులను నియమించుకునేలా ఈ కొత్త వీసా ప్రోగ్రామ్ కు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ప్రైమరీ 457వీసా ప్రోగ్రామ్ పై దాదాపు 95,757 మంది వర్కర్లు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారని ఏబీసీ రిపోర్టు చేసింది.
గొర్రెల పెంపకందారులు, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్లు, ప్లానింగ్ మేనేజర్లు, ప్రాజెక్టు బిల్డర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, రీజినల్ ఎడ్యుకేషన్ మేనేజర్లు, ఫైర్ ఆఫీసర్స్, కాల్ సెంటర్ మేనేజర్లు, సినిమా థియేటర్ మేనేజర్లు, నటులు, డ్యాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, గాయకులు, పెయింటర్స్, ఫొటోగ్రఫీ, రేడియో జర్నలిస్టులు, పాలసీ అనలిస్టులు, లైజన్ ఆఫీసర్లు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, పైలట్స్, షిప్ ఇంజనీర్లు, మల్టీమీడియా డిజైనర్లు, కెమికల్, మెటీరియల్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, పెట్రోలియం ఇంజనీర్లు, ఫుడ్ టెక్నాలజిస్టులు, హైడ్రాలజిస్టులు, సివిల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్, బయోకెమిస్టులు, నర్స్ రీసెర్చర్స్, డ్రామా టీచర్, వెబ్ డెవలపర్, లేబరేటరీ టెక్నీషియన్స్, షూ మేకర్స్, పాలసీ అనలిస్టులు ... ఇలా మొత్తం 216 రకాల ఉద్యోగాలకు సంబంధించిన 457 వీసా ప్రోగ్రామ్ ను ఆస్ట్రేలియా రద్దు చేసింది.
Advertisement
Advertisement