కబుర్లు.. నవ్వులు.. కాక్‌టైల్‌! | Donald trump feast to narendra modi | Sakshi
Sakshi News home page

కబుర్లు.. నవ్వులు.. కాక్‌టైల్‌!

Published Wed, Jun 28 2017 1:09 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

కబుర్లు.. నవ్వులు.. కాక్‌టైల్‌! - Sakshi

కబుర్లు.. నవ్వులు.. కాక్‌టైల్‌!

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీకి వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఇచ్చిన ఆత్మీయ విందు ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక మొదటిసారి విదేశీ ప్రధానికి ఇచ్చిన ఈ విందుకు బ్లూరూమ్‌ వేదికైంది. విందు సందర్భంగా నవ్వులు పూయడంతో పాటు.. ట్రంప్, మోదీలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఇక వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి నివాస ప్రాంతాల్ని ట్రంప్‌ దగ్గరుండి మోదీకి చూపించారు.

విందులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. మీరిచ్చిన విందు ఆహ్వానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.. నిజానికి నేను అమెరికాలో చాలా తక్కువ సమయం గడిపినా.. ఉన్నంతసేపూ భారత్‌లో ఉన్నట్లే గడించింద’ని ఆనందం వ్యక్తం చేశారు. రౌండ్‌ టేబుల్‌ విందులో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో పాటు రక్షణ మంత్రి జేమ్స్‌ మాటీస్, విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్‌ రాస్, రెవెన్యూ మంత్రి స్టీవ్‌ మ్యుచిన్, జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఆర్‌ మెక్‌మస్టర్‌లు, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రైన్స్‌ ప్రీబస్, సీనియర్‌ సలహాదారు జరద్‌ కుష్నర్‌లు పాల్గొన్నారు.

యూపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ
విందులో మోదీ గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా.. ప్రధాని మోదీ అమెరికాకు ఇంతకుముందే రావా ల్సింది. అప్పుడు భారత్‌లో కొన్ని చోట్ల ఎన్నికలు జరగడంతో ఇప్పుడు వచ్చారు. అది ఓ చిన్న ప్రాంతంలో జరిగిన ఎన్నిక’ని పేర్కొన్నారు. నిజానికి ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరిగాయి. అయితే అతిఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ను ఉద్దేశించి చిన్న ప్రాంతంగా ట్రంప్‌ పేర్కొన డం గమనార్హం. వెంటనే మోదీ స్పందిస్తూ..‘ఆ ఎన్నికల్లో మా పార్టీ గెలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీలో మూడొంతుల మెజార్టీ సాధించామ’ని చెప్పారు. అది అద్భుతమైన విజయమని ట్రంప్‌ ప్రశంసించారు.

మెలానియా కాక్‌టైల్‌ విందు
ముందుగా మోదీకి మెలానియా ట్రంప్‌ కాక్‌ టైల్‌ విందు ఇచ్చారు. మెలానియా విందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..‘నా గౌరవార్థం అమెరికా ప్రథమ మహిళ ఈ విందు ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్‌లో దక్కిన గౌరవం నాకొక్కడికే కాదు. మొత్తం 125 కోట్ల భారతీయులకు కూడా’ అని మోదీ కృతజ్ఞతలు చెప్పారు. వెంటనే ట్రంప్‌ అందుకుని.. మీడియా వెళ్లగానే నేను కూడా ఘనంగా విందు ఇస్తానని చెప్పగా నవ్వులు పూశాయి.

‘చాలా ప్రత్యేకమైన విందుకు వెళ్లబోతున్నాం. ఘనమైన ఆత్మీయ విందు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. మీరంతా వైట్‌హౌస్‌లో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ రోజు సమావేశాలు విజయవంతంగా, గొప్పగా సాగాయ’ని ట్రంప్‌ అన్నారు.. వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి నివాస సముదాయాల్ని దగ్గరుండి మోదీకి ట్రంప్‌ చూపించారు. లింకన్‌ బెడ్‌రూం, ఆయన చేసిన గెట్టీస్‌బర్గ్‌ ప్రసంగ పాఠం, రాసేందుకు లింకన్‌ వాడిన బల్ల ప్రాముఖ్యతను మోదీకి వివరించారు.

మోదీ భార్య రాలేదా!!
ప్రధాని మోదీ శ్వేతసౌధానికి వెళ్లినప్పుడు ఓ తమాషా సంఘటన జరిగింది. మోదీకి స్వాగతం పలికేందుకు అప్పటికే అక్కడ అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియాలు సిద్ధంగా ఉన్నారు. మోదీ కారు వైట్‌హౌస్‌ వద్దకు వచ్చి ఆగింది. వెంటనే గార్డు వచ్చి ట్రంప్‌ నిల్చొని ఉన్న వైపుకు కారు డోర్‌ తీశాడు.

కారు నుంచి దిగి మోదీ ట్రంప్‌తో మాట్లాడుతుండగా మరో గార్డు కారుకు అవతలి వైపున ఉన్న డోర్‌ తీసి అయోమయంగా లోపలకు చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు..బహుశా మోదీ భార్య కూడా వచ్చి ఉంటారని భావించి గార్డు డోర్‌ తెరిచి ఉంటాడనీ, ఆమె కనిపించకపోయే సరికి తెల్లమొహం వేశాడని సరదాగా వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌ దంపతులకు శాలువా, బ్రేస్‌లెట్‌
ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ పలు బహుమతులు అందించారు. వైట్‌హౌస్‌లో ఇరు నేతల మధ్య ముఖాముఖి సమావేశం సందర్భంగా.. అబ్రహం లింకన్‌ స్మారక ప్రత్యేక తపాలా స్టాంప్‌ను మోదీ బహూకరించారు. అబ్రహం లింకన్‌ జ్ఞాపకార్థం 1965లో భారత ప్రభుత్వం ఈ తపాలా స్టాంప్‌ను విడుదల చేసింది. అలాగే ఒక పెట్టెలో హిమాచలి సిల్వర్‌ బ్రేస్‌లెట్, హిమాచల్‌ప్రదేశలోని కంగ్రా లోయ నుంచి తీసుకువచ్చిన టీ పొడి, కశ్మీరీ తేనెను అందచేశారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో చేతితో తయారుచేసిన శాలువాల్ని ట్రంప్‌ దంపతులకు బహూకరించారు.

భారత్‌కు రండి: మోదీ ఆహ్వానం
వైట్‌హౌస్‌లో విందు అనంతరం రోజ్‌ గార్డెన్‌వద్ద మోదీ మాట్లాడుతూ.. ట్రంప్‌ దంపతుల ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్, మెలానియాల్ని కుటుంబ సమేతంగా భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం విదేశాంగ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ.. మోదీ ఆహ్వానాన్ని ట్రంప్‌ అంగీకరించారని, అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదని చెప్పారు.

కాగా ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్‌ నేతృత్వం వహించాల్సిందిగా మోదీ కోరారు. ఈ ఆహ్వానాన్ని ఇవాంకా అంగీకరించిందని ట్రంప్‌ తెలిపారు. అనంతరం ట్విటర్‌లో ఇవాంకా స్పందిస్తూ... ‘సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు ప్రాతినిథ్యం వహించాలని మోదీ కోరడం సంతోషంగా ఉంది, నన్ను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఇబ్బంది నుంచి తప్పించిన దోవల్‌
శ్వేతసౌధంలో మీడియా సమావేశంలో మోదీకి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆయనను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తప్పించారు. అధ్యక్ష భవనంలోని ‘రోజ్‌ గార్డెన్‌’లో మీడియా సమావేశం జరుగుతోంది. మోదీ చేతిలో మీడియా వారికి ఇవ్వడానికి ముందుగానే సిద్ధం చేసిన కొన్ని పేపర్లు ఉన్నాయి. ట్రంప్‌ మాటలను మోదీ శ్రద్ధగా వింటుండగా పెద్ద గాలి వచ్చి, ఆ పేపర్లు మోదీ చేజారి చెదిరిపోయాయి. అక్కడే ఉన్న అజిత్‌ దోవల్‌ వెంటనే వాటిని తీసుకుని మోదీకి అందించారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైంది. రెండోసారి కూడా దోవల్‌ పేపర్లను మోదీకి అందించి, ఆయనకు ఇబ్బందిని తప్పించారు.

 సోషల్‌ మీడియాలో మేమే లీడర్స్‌
సోషల్‌ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ, తాను ప్రపంచ నేతలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఇద్దరు నేతలకు ట్వీటర్, ఫేస్‌బుక్‌ల్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను గర్వంగా చెబుతున్నాను. భారతీయులకు, అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, నేను సోషల్‌ మీడియాలో ప్రపంచ నేతల’మని వైట్‌హౌస్‌ రోజ్‌ గార్డెన్‌ వద్ద మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇరు దేశాల పౌరులకు పాలకులు చెప్పదలచుకున్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు,  ప్రజా సమస్యల్ని కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలనేది మా ఇద్దరి అభిమతం. రెండు దేశాల్లో ఈ విధానం విజయమైందని నా నమ్మక’మని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌కు ట్విటర్‌లో 3.28 కోట్లు, మోదీకి 3.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఫేస్‌బుక్‌లో ట్రంప్‌కు 2.36 కోట్లు, మోదీకి 4.18 కోట్ల మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement