ట్రంప్కు కన్నబిడ్డలే ఓటెయ్యరట!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ వివాదాస్పద అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు సొంతింట్లోనే ఆదరణ కరువైంది. ఆయన కన్నబిడ్డలే ఆయనకు ఓటేసే పరిస్థితి లేకుండా పోయింది. ఓటు నమోదుకు విధించిన ఆఖరు తేది నాటికి ట్రంప్ కుమార్తె, కుమారుడు ఓటు నమోదు చేసుకునే విషయంలో విఫలమయ్యారు. దీంతో న్యూయార్క్లో ఏప్రిల్ 19న జరిగే ప్రైమరీ ఓటింగ్లో తమ తండ్రికి ఓటేసి అవకాశం కోల్పోయారు. ట్రంప్కు ఇవంకా, ఎరిక్ ట్రంప్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
'వాస్తవానికి వారు ఓటు నమోదుచేసుకునేందుకు చాలా సమయం ఉంది. కానీ, సరైన నియమ నిబంధనలు తెలియక వారు ఓటు రిజిస్ట్రేషన్ లో విఫలమయ్యారు' అని ట్రంప్ స్వయంగా చెప్పారు. 'వారు ఈ ఘటనపట్ల ఎంతో బాధపడుతున్నారు. అయినా ఏం ఫర్వాలేదు. నేను అర్ధం చేసుకోగలను. ఒక ఏడాది ముందే ఓటు నమోదుచేసుకోవాల్సి ఉండేది. కానీ అలా చేయలేదు. అందుకే ఎరిక్, ఇవాంక ఓటు వేయలేకపోవచ్చు' అని ట్రంప్ చెప్పాడు.
సాధారణంగా న్యూయార్క్లో ఓటు ఉపయోగించుకునే వారు ఓటు సమయానికి కొద్ది నెలల ముందే పార్టీ తరుపునగానీ, పార్టీ మారుతున్న దస్త్రంపై గానీ నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వారికి అక్టోబర్ 9, 2015ను ఓటు నమోదుచేసుకునేందుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. కాగా, ట్రంప్తో పాటు ప్రచారంలో పాల్గొన్న కుమార్తె, కుమారుడు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలం కావడంతో వారికి ఇచ్చే అలవెన్సులు కట్ చేస్తానంటూ ట్రంప్ జోక్ చేశాడు.