అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్: మాల్దీవుల అంతర్గత సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య అఫ్గానిస్తాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి, రోహింగ్యాల అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు వైట్‌హౌజ్ తెలిపింది. మాల్దీవుల్లో అత్యయిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేసిన ట్రంప్, మోదీ..అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్ధరణ, పౌర హక్కుల పరిరక్షణ ప్రాధాన్యతపై చర్చించారని శ్వేతసౌధం పేర్కొంది. ట్రంప్ దక్షిణాసియా విధానానికి అనుగుణంగా అఫ్గానిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ వలసొచ్చిన రోహింగ్యా ముస్లింల దుస్థితిపై చర్చించారు. ఉత్తరకొరియా అణు పరీక్షల అంశమూ చర్చకొచ్చింది. ఏప్రిల్‌లో జరగాల్సిన ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
భారత్‌తో మరో సమస్య కాకూడదు: చైనా
మాల్దీవుల సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చైనా పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాల్లో ఈ వ్యవహారం మరో సమస్యగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.మాల్దీవుల సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించి తదనుగుణంగా మసలుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ శుక్రవారం సూచించారు. మాల్దీవుల్లో మోహరించడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ..ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్య సూత్రమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మాల్దీవుల్లో పరిస్థితి మరింత క్షీణించే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment