న్యూయార్క్ : భారత్‌లో తనకు లక్షలాది మంది స్వాగతం పలుకుతారని ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత పర్యటన పట్ల తాను ఆసక్తిగా వేచిచూస్తున్నానని చెప్పారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో ట్రంప్ దంపతులు న్యూఢిల్లీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రకటించిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు..ఆయన చాలా జెంటిల్‌మెన్ అంటూ చెప్పుకొచ్చారు.
మోదీతో తాను ఇటీవల ఫోన్‌లో ముచ్చటించానని, ఎయిర్‌పోర్ట్ నుంచి క్రికెట్ స్టేడియం వరకూ లక్షల సంఖ్యలో ప్రజలు తనను స్వాగతిస్తారని ఆయన తనతో చెప్పారని వెల్లడించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ఇటీవల తన ర్యాలీకి 50,000 మంది వరకూ వచ్చినా మోదీ చెప్పిన సంఖ్యతో పోలిస్తే అది సంతృప్తికరం కాదని వ్యంగ్యంగా అన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వరకూ 50 నుంచి 70 లక్షల మంది ప్రజలు రావాలని ఛలోక్తి విసిరారు. భారత్‌తో ట్రేడ్ డీల్ గురించి అడగ్గా, సరైన ఒప్పందం ముందుకొస్తే తాను దీనిపై చొరవ చూపుతానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment