Indian tour
-
ట్రంప్ వెంట ఇద్దరు ఇండో అమెరికన్లు..
న్యూయార్క్ : ఈనెల 24, 25న రెండు రోజుల భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి బృందంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్ అజిత్ పాయ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారి కష్ పటేల్‌లు ఈ బృందంలో సభ్యులుగా అధ్యక్షుడి వెంట సోమవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పాయ్ తల్లితండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వైద్యులు కాగా 1971లో వారు అమెరికాకు వలస వెళ్లారు. కాన్సాస్‌లో జన్మించిన పాయ్ హార్వార్డ్, చికాగో యూనివర్సిటీల్లో విద్యాభ్యాసంతో న్యాయవాదిగా ఎదిగారు. 2012లో ఆయన ఎఫ్‌సీసీలో చేరి అనంతరం అయిదుగురు కమిషనర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. 2017లో ట్రంప్ పాయ్‌ను ఎఫ్‌సీసీ చీఫ్‌గా నియమించారు. ఇక గుజరాత్ మూలాలున్న కష్ పటేల్ తల్లితండ్రులు తూర్పు ఆఫ్రికా, కెనడాల నుంచి న్యూయార్క్‌లో స్ధిరపడ్డారు. రష్యా జోక్యంపై దర్యాప్తును తోసిపుచ్చడం ద్వారా పటేల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 2018లో పటేల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెదిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్స్‌లో చేరారు. ఉగ్రవాద నిరోధక విభాదగం బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. పటేల్ గతంలో రిపబ్లికన్ నాయకత్వానికి చెందిన హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి కూడా పనిచేశారు. చదవండి : వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్ -
భారత్ టూర్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
న్యూయార్క్ : భారత్‌లో తనకు లక్షలాది మంది స్వాగతం పలుకుతారని ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత పర్యటన పట్ల తాను ఆసక్తిగా వేచిచూస్తున్నానని చెప్పారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో ట్రంప్ దంపతులు న్యూఢిల్లీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రకటించిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు..ఆయన చాలా జెంటిల్మెన్ అంటూ చెప్పుకొచ్చారు. మోదీతో తాను ఇటీవల ఫోన్లో ముచ్చటించానని, ఎయిర్పోర్ట్ నుంచి క్రికెట్ స్టేడియం వరకూ లక్షల సంఖ్యలో ప్రజలు తనను స్వాగతిస్తారని ఆయన తనతో చెప్పారని వెల్లడించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ఇటీవల తన ర్యాలీకి 50,000 మంది వరకూ వచ్చినా మోదీ చెప్పిన సంఖ్యతో పోలిస్తే అది సంతృప్తికరం కాదని వ్యంగ్యంగా అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి స్టేడియం వరకూ 50 నుంచి 70 లక్షల మంది ప్రజలు రావాలని ఛలోక్తి విసిరారు. భారత్‌తో ట్రేడ్ డీల్ గురించి అడగ్గా, సరైన ఒప్పందం ముందుకొస్తే తాను దీనిపై చొరవ చూపుతానని స్పష్టం చేశారు. చదవండి : ట్రంప్ విజయగర్వం -
ట్రంప్ టూర్‌తో ట్రేడ్ డీల్ ఖరారు..!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధం మరింత పటిష్టమవుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌లు భారత్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రకటించిన క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ ట్రంప్ దంపతుల పర్యటనపై వ్యాఖ్యానించింది. ట్రంప్ రాకతో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. ట్రంప్, మెలానియాలు భారత్ పర్యటనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్‌లో జరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు వర్గాల ప్రజలతో ముచ్చటిస్తారని వెల్లడించింది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని భావిస్తున్నారు. కాగా గత ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా రావాలని ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన హాజరు కాలేకపోయారు. చదవండి : ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని.. -
విశ్వాస కల్పనే లక్ష్యంగా..!
* చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని చర్చలు * సరిహద్దు సమస్య, పీఓకేలో ఆర్థిక కారిడార్ నిర్మాణం, * అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రస్తావించిన మోదీ * ఉగ్రవాదంపై పోరు, ఐరాస సంస్కరణలపై సహకారం * పెట్టుబడులు, వాణిజ్య వృద్ధిపై సమాలోచనలు * జిన్‌పింగ్ స్వస్థలం జియాన్‌లో మోదీకి ఘన స్వాగతం జియాన్: చైనాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత పర్యటన మోదీ సొంత నగరం అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విధంగానే.. మోదీ చైనా పర్యటన జిన్‌పింగ్ స్వస్థలం ప్రాచీన నగరం జియాన్ నుంచి ప్రారంభం కావడం విశేషం. ప్రొటోకాల్‌ను కాదని బీజింగ్‌లో కాకుండా జియాన్‌లోని షాంజి గెస్ట్ హౌస్‌లో మోదీకి జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతకు బీజింగ్ వెలుపల స్వాగతం పలకడం తనకు తొలిసారని జిన్‌పింగ్ పేర్కొనగా.. అందుకు జిన్‌పింగ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం 125 కోట్ల భారతీయులకు చెందుతుందన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో తనకు లభించిన స్వాగతాన్ని జిన్‌పింగ్ జ్ఞాపకం చేసుకున్నారు. మోదీ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్‌లో తన భారత పర్యటన అనంతరం ఇరుదేశాల సంబంధాల్లో విస్తృత స్థాయిలో పురోగతి కనిపిస్తోందన్నారు. మోదీ హిందీలో, జిన్‌పింగ్ చైనీస్ భాషలో సంభాషించారు. అనంతరం దాదాపు గంటన్నర పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. సౌహార్ద్ర వాతావరణంలో పరస్పర విశ్వాసం దృఢతరమయ్యే దిశగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ తెలిపారు. రాజకీయ, ఆర్థికాంశాలతో పాటు ఉగ్రవాదం, ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో సంస్కరణలు, అణు సరఫరా బృందంలో భారత్‌కు చోటు.. తదితర అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారని వెల్లడించారు. అనంతరం గురువారం రాత్రి వరకు మోదీ బీజింగ్ చేరుకున్నారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో శుక్రవారం విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. మోదీ, జిన్‌పింగ్ చర్చల్లోని ముఖ్యాంశాలు - సరిహద్దు సమస్యపై, సరిహద్దులో శాంతిని నెలకొల్పే విషయంపై, ఇరుదేశాల్లోనూ ప్రవహిస్తున్న నదుల అంశంపై చర్చించారు. సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి బృందాలు ఇప్పటివరకు 18 సార్లు సమావేశమై చర్చలు జరిపాయి. - పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్ అంశాన్ని లేవనెత్తిన మోదీ.. ఆ నిర్మాణంలో చైనా 4,600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడాన్ని ప్రశ్నించారు. - అరుణాచల్ ప్రదేశ్ వాసులకు స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడాన్ని కూడా మోదీ లేవనెత్తారని సమాచారం. అరుణాచల్ దక్షిణ టిబెట్‌కు చెందుతుందని చైనా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. - ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాకు అనుకూలంగా ఉన్న దాదాపు 3,800 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు అంశంపై, ఆ లోటును తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యల విషయంపై చర్చించారు. - రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతమయ్యేందుకు నెలకొల్పాల్సిన పెట్టుబడుల అనుకూల వాతావరణంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా మోదీ నేతృత్వంలో గుజరాత్ సాధించిన విజయాలను జిన్‌పింగ్ ప్రస్తావించగా.. ఆ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు మోదీ వివరించారు. - బుధవారం నాటి కరాచీ దాడి, గురువారం నాటి కాబూల్ దాడులపై విచారం వ్యక్తం చేసిన నేతలు.. ఉగ్రవాదం అంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం అవసరమని నిర్ణయించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై తీర్మానం(సీసీఐటీ)పై చర్చలను త్వరగా ముగించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు. - రెండు దేశాలు కలిసి పనిచేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఇరుదేశాల మధ్య అనుసంధానత పెంపు.. తదితరాలను చర్చించారు. పగోడాకు కలసి వెళ్లి.. దక్షిణ జియాన్‌లోని ప్రఖ్యాత పగోడా ఆలయానికి మోదీని జిన్‌పింగ్ స్వయంగా తోడ్కొనివెళ్లారు. చైనాలో బౌద్ధం వ్యాప్తికి కృషి చేసిన ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి హుయెన్త్సాంగ్(జువాన్ జాంగ్ అనే పేరు కూడా ఉంది) స్మారకంగా ఐదంతస్తులతో క్రీశ 652లో ఆ బౌద్ధ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి బోధి మొక్కను మోదీ బహూకరించగా, బదులుగా, హుయన్‌త్సాంగ్ ప్రతిమను పగోడాలోని బౌద్ధ సన్యాసులు అందించారు. అరుణాచల్, కశ్మీర్ లేని భారత్! ఒకవైపు భారత ప్రధాని పర్యటన సాగుతుండగానే.. చైనా అధికార టెలివిజన్ చానల్ సీసీటీవీ ఒక దుశ్చర్యకు పాల్పడింది. ప్రధాని మోదీ పర్యటన వార్తలను ప్రసారం చేస్తూ.. జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లు లేని భారతదేశ పటాన్ని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాంగ్ వంశ సంప్రదాయ స్వాగతం చైనాలోని అతి పురాతన గోడ ‘జియాన్ సిటీ వాల్’ సందర్శనకు వెళ్లిన మోదీకి అపూర్వ రీతిలో అద్భుత స్వాగతం లభించింది. ఆ చరిత్రాత్మక ప్రదేశంలోని ప్రాచీన సిటీగేట్ వద్ద తాంగ్ వంశ సంప్రదాయ రీతిలో భారత ప్రధానికి స్వాగతం పలికారు. జియాన్ సిటీ గోడ 40 అడుగుల ఎత్తుతో, 14 కిమీల పొడవుంటుంది. ఇక్కడ మోదీకి జిన్‌పింగ్ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. -
రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా
వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు రష్యా మద్దతిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించారు. -
శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్
కొలంబో : శ్రీలంక క్రికెట్ బోర్డుపై మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీసీఐని మెప్పించడం కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశ నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు. భారత్‌లో 4వ వన్డేలో శ్రీలంక పరాజంయ అనంతరం రణతుంగ నిప్పులు చెరిగాడు. సెలక్షన్ ఛైర్మన్ జయసూర్య, జాతీయ కోచ్ ఆటపట్టు, కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్‌లు ఓటమికి బాధ్యత వహించాలని అతడు డిమాండ్ చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపొందలేదు. దాంతో భారత్ కు 4-0 ఆధిక్యం దక్కింది. కాగా వెస్టిండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. దాంతో వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. -
తిరుగుబాటు
భారత్‌లో అడుగు పెట్టినప్పటినుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న వెస్టిండీస్ క్రికెటర్ల అసంతృప్తి... ఇప్పుడు దావానలంలా మారింది. దీంతో డ్వేన్ బ్రేవో బృందం ఏకంగా భారత పర్యటన నుంచి వైదొలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లు అనూహ్య నిర్ణయం తీసుకుని... ధర్మశాల వన్డేతోనే సిరీస్‌ను ముగించారు. దీనిపై బీసీసీఐకి కూడా కోపం వచ్చింది. తక్షణమే శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఐదు వన్డేల సిరీస్‌ను ఖరారు చేసుకుంది. ధర్మశాల: నాలుగో వన్డే ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో జట్టు కెప్టెన్ బ్రేవో ఒక్కడే రాలేదు. తన జట్టు సహచరులందరినీ తోడుగా తీసుకొచ్చాడు. వ్యాఖ్యాతగా ఉన్న విండీస్ మాజీ క్రికెటర్ బిషప్తో మాట్లాడుతూ ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది’ అని వెల్లడించాడు. అయితే ఈ ప్రకటనకు ముందే తాము భారత పర్యటనను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు జట్టు మేనేజర్ రిచీ రిచర్డ్సన్, బీసీసీఐకి మెయిల్ పంపారు. దీంతో భారత పర్యటనలో ధర్మశాల వన్డేనే ఆఖరిది అయ్యింది. ఈ పర్యటనలో మిగిలిన ఒక వన్డే, ఒక టి20 మ్యాచ్, మూడు టెస్టులు జరిగే అవకాశం లేదు. ‘ఆటగాళ్ల మధ్య అంతర్గత సమస్యలే’ పర్యటన రద్దుకు కారణమని విండీస్ బోర్డు తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కారణమేంటి ఈ ఏడాది సెప్టెంబర్ 19న విండీస్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే తమతో చర్చించకుండా ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది అమల్లోకి వస్తే తాము భారీగా నష్టపోతామంటూ జట్టు ఆటగాళ్లు కొచ్చిలో తొలి వన్డేకు ముందే నిరసన వ్యక్తం చేశారు. మ్యాచ్ బరిలోకి దిగినా... సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, హైండ్స్ రాజీనామా చేయాలని బ్రేవో బృందం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కూడా బోర్డుకు బ్రేవో లేఖ రాశాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు సహకరిస్తామని అప్పట్లో మాట ఇచ్చారని, తాను రాజీమానా చేసేది లేదని హైండ్స్ స్పష్టం చేశాడు. అటు బోర్డు కూడా ఆటగాళ్లతో నేరుగా కాకుండా ప్లేయర్స్ అసోసియేషన్‌తోనే తాము చర్చిస్తామని గురువారం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన ఆటగాళ్లు భారత్‌తో సిరీస్‌ను తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ అదే డ్రామా నాలుగో వన్డేకు ముందే వెస్టిండీస్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హోటల్‌కు వెళ్లి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లతో పాటు రిచర్డ్సన్, ఆంబ్రోస్‌లతో కూడా వరుసగా మాట్లాడారు. ‘మ్యాచ్ లేకపోతే మాకు అవమానం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. వన్డే చూసేందుకు చాలా దూరంనుంచి అభిమానులు వస్తున్నారు. ఇంత చెప్పినా మీరు ఆడమంటే ఇక మేమేమీ చేయలేం’ అని ఠాకూర్ అన్నట్లు సమాచారం. చివరకు దీనిని మన్నిస్తూ టాస్కు గంట ముందు విండీస్ మైదానానికి చేరుకుంది. ‘విండీస్ జట్టు నా వెనకే నిలబడింది. ఇది మాకు కఠిన పర్యటన. మేమందరం కలిసికట్టుగా పోరాడాం. క్రికెట్, అభిమానులు ఇబ్బంది పడాలని మేం కోరుకోవడం లేదు. ఇక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది’ అని మ్యాచ్‌కు ముందు బ్రేవో వ్యాఖ్యానించాడు. బీసీసీఐ ఆగ్రహం వెస్టిండీస్ క్రికెటర్ల అనూహ్య నిర్ణయాన్ని బీసీసీఐ తేలిగ్గా వదిలి పెట్టాలనుకోవడం లేదు. ఐసీసీని సంప్రదించి జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ దావా వేయాలని భావిస్తోంది. ‘వెస్టిండీస్ క్రికెటర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. సమస్యను సరిగ్గా పరిష్కరించలేని విండీస్ బోర్డు అసమర్థత కారణగా ద్వైపాక్షిక సిరీస్ రద్దయింది భవిష్యత్తులో భారత్, విండీస్ మధ్య సంబంధాలపై కూడా దీని ప్రభావం పడుతుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా చర్య తీసుకోవాలని బోర్డులోని సీనియర్లు భావిస్తున్నారు. కనీసం ఒక సీజన్‌కైనా వారిపై నిషేధం విధించాలని వారు గట్టిగా కోరుతున్నారు. శ్రీలంకతో ఐదు వన్డేలు వెస్టిండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో మరో జట్టును భారత్‌కు పిలిచి సిరీస్ ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల ప్రకారం శ్రీలంక అందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 1-15 మధ్య శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. దీనిని లంక బోర్డు కార్యదర్శి నిషాంత రణతుంగ ప్రాథమికంగా నిర్ధారించారు. -
విండీస్ జట్టు స్థానంలో భారత్ లో శ్రీలంక పర్యటన!
కొలంబో: భారత పర్యటన నుంచి వెస్టిండీస్ తప్పుకున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది. భారత్ లో శ్రీలంక పర్యటన ఖారారైందని, అయితే ఇంకా షెడ్యూల్ ఫిక్స్ కాలేదని శ్రీలంక క్రికెట్ సెక్రెటరీ నిశాంత రణతుంగ తెలిపారు. విండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది. -
ప్రజాసంబంధాలే పాలనకు కీలకం
* తనను కలిసిన ఫేస్బుక్ సీవోవోతో ప్రధాని * ఫేస్బుక్ ద్వారా పర్యాటకులను ఆకర్షించడంపై చర్చ న్యూఢిల్లీ: ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో కీలకాంశమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిపాలనకు ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ వంటి వేదికను పనిముట్టుగా ఉపయోగించుకోవచ్చన్నారు. భారత పర్యటనలో ఉన్న ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బెర్గ్ గురువారం ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. భారత్‌లో ఫేస్‌బుక్‌ను మరింత విస్తరించడంపై తన ఆలోచనలను సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించే మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆమెతో మాట్లాడుతూ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో ముఖ్యమన్నారు. అనంతరం ఈ భేటీ వివరాలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దేశంలోకి మరింత మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఫేస్‌బుక్‌ను ఎలా ఉపయోగించాలో షెరిల్‌తో చర్చించానని, ఆమెతో భేటీ ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. మోడీతో భేటీలో ఫేస్బుక్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మార్న్ లెవిన్, పబ్లిక్ పాలసీ భారత విభాగం చీఫ్ అంఖీ దాస్ పాల్గొన్నారు. మరోవైపు మోడీతో భేటీ అనంతరం షెరిల్...కమ్యూనికేషన్లు, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, ఈ-గవర్నెన్స్ తదితర రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై ఈ భేటీలో చర్చించినట్లు విలేకరులతో మాట్లాడుతూ షెరిల్ చెప్పారు. రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఫేస్బుక్లో మరిన్ని భాషలను చేర్చాల్సిందిగా కోరానన్నారు. కాగా, ఫేస్బుక్లో 1.89 కోట్ల ‘లైక్’లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా తర్వాత రెండో స్థానంలో నిలిచిన మోడీ... ట్విట్టర్లో 50.90 లక్షల మంది ‘ఫాలోవర్ల’తో ఒబామా, పోప్ తర్వాత మూడో అతిపెద్ద ప్రపంచ నేతగా నిలిచారు. మోడీతో అమెరికా సెనేటర్ సమావేశం అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్కెయిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం పునరుత్తేజానికి మోడీతో కలిసి పనిచేయాలన్న బలమైన కోరిక అమెరికాలో వ్యక్తమవుతోందని చెప్పారు. ఇందుకు మోడీ బదులిస్తూ ద్వైపాక్షిక సంబంధాలను నూతన స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానన్నారు. సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మోడీ కాశ్మీర్ పర్యటనకు భారీ భద్రత: ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి పర్యటిస్తుండటం, ఈ పర్యటనకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్సహా వేర్పాటువాద గ్రూపులన్నీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపట్టాయి. ఈ పర్యటన సందర్భంగా మోడీ తొలుత జమ్మూలోని ఉధంపూర్ నుంచి కాత్రా వరకూ కొత్తగా నిర్మించిన 25 కి.మీ. రైలు మార్గంలో ప్రయాణించే తొలి రైలును కాత్రా స్టేషన్‌ను ప్రారంభిస్తారు. వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఇకపై ఈ రైలు మార్గం ద్వారా నేరుగా కాత్రాలోని బేస్ క్యాంపునకు చేరుకోవచ్చు.