జట్ట సభ్యులతో సహ టాస్ కు వచ్చిన డ్వేన్ బ్రావో
భారత్‌లో అడుగు పెట్టినప్పటినుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న వెస్టిండీస్ క్రికెటర్ల అసంతృప్తి... ఇప్పుడు దావానలంలా మారింది. దీంతో డ్వేన్ బ్రేవో బృందం ఏకంగా భారత పర్యటన నుంచి వైదొలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లు అనూహ్య నిర్ణయం తీసుకుని... ధర్మశాల వన్డేతోనే సిరీస్‌ను ముగించారు. దీనిపై బీసీసీఐకి కూడా కోపం వచ్చింది. తక్షణమే శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఐదు వన్డేల సిరీస్‌ను ఖరారు చేసుకుంది.
ధర్మశాల: నాలుగో వన్డే ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో జట్టు కెప్టెన్ బ్రేవో ఒక్కడే రాలేదు. తన జట్టు సహచరులందరినీ తోడుగా తీసుకొచ్చాడు. వ్యాఖ్యాతగా ఉన్న విండీస్ మాజీ క్రికెటర్ బిషప్‌తో మాట్లాడుతూ ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది’ అని వెల్లడించాడు.
అయితే ఈ ప్రకటనకు ముందే తాము భారత పర్యటనను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు జట్టు మేనేజర్ రిచీ రిచర్డ్సన్, బీసీసీఐకి మెయిల్ పంపారు. దీంతో భారత పర్యటనలో ధర్మశాల వన్డేనే ఆఖరిది అయ్యింది. ఈ పర్యటనలో మిగిలిన ఒక వన్డే, ఒక టి20 మ్యాచ్, మూడు టెస్టులు జరిగే అవకాశం లేదు. ‘ఆటగాళ్ల మధ్య అంతర్గత సమస్యలే’ పర్యటన రద్దుకు కారణమని విండీస్ బోర్డు తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
కారణమేంటి
ఈ ఏడాది సెప్టెంబర్ 19న విండీస్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే తమతో చర్చించకుండా ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది అమల్లోకి వస్తే తాము భారీగా నష్టపోతామంటూ జట్టు ఆటగాళ్లు కొచ్చిలో తొలి వన్డేకు ముందే నిరసన వ్యక్తం చేశారు.
మ్యాచ్ బరిలోకి దిగినా... సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, హైండ్స్ రాజీనామా చేయాలని బ్రేవో బృందం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కూడా బోర్డుకు బ్రేవో లేఖ రాశాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు సహకరిస్తామని అప్పట్లో మాట ఇచ్చారని, తాను రాజీమానా చేసేది లేదని హైండ్స్ స్పష్టం చేశాడు. అటు బోర్డు కూడా ఆటగాళ్లతో నేరుగా కాకుండా ప్లేయర్స్ అసోసియేషన్‌తోనే తాము చర్చిస్తామని గురువారం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన ఆటగాళ్లు భారత్‌తో సిరీస్‌ను తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
మళ్లీ అదే డ్రామా
నాలుగో వన్డేకు ముందే వెస్టిండీస్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హోటల్‌కు వెళ్లి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లతో పాటు రిచర్డ్సన్, ఆంబ్రోస్‌లతో కూడా వరుసగా మాట్లాడారు. ‘మ్యాచ్ లేకపోతే మాకు అవమానం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. వన్డే చూసేందుకు చాలా దూరంనుంచి అభిమానులు వస్తున్నారు. ఇంత చెప్పినా మీరు ఆడమంటే ఇక మేమేమీ చేయలేం’ అని ఠాకూర్ అన్నట్లు సమాచారం.
చివరకు దీనిని మన్నిస్తూ టాస్‌కు గంట ముందు విండీస్ మైదానానికి చేరుకుంది. ‘విండీస్ జట్టు నా వెనకే నిలబడింది. ఇది మాకు కఠిన పర్యటన. మేమందరం కలిసికట్టుగా పోరాడాం. క్రికెట్, అభిమానులు ఇబ్బంది పడాలని మేం కోరుకోవడం లేదు. ఇక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది’ అని మ్యాచ్‌కు ముందు బ్రేవో వ్యాఖ్యానించాడు.
బీసీసీఐ ఆగ్రహం
వెస్టిండీస్ క్రికెటర్ల అనూహ్య నిర్ణయాన్ని బీసీసీఐ తేలిగ్గా వదిలి పెట్టాలనుకోవడం లేదు. ఐసీసీని సంప్రదించి జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ దావా వేయాలని భావిస్తోంది. ‘వెస్టిండీస్ క్రికెటర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. సమస్యను సరిగ్గా పరిష్కరించలేని విండీస్ బోర్డు అసమర్థత కారణగా ద్వైపాక్షిక సిరీస్ రద్దయింది భవిష్యత్తులో భారత్, విండీస్ మధ్య సంబంధాలపై కూడా దీని ప్రభావం పడుతుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా చర్య తీసుకోవాలని బోర్డులోని సీనియర్లు భావిస్తున్నారు. కనీసం ఒక సీజన్‌కైనా వారిపై నిషేధం విధించాలని వారు గట్టిగా కోరుతున్నారు.
శ్రీలంకతో ఐదు వన్డేలు
వెస్టిండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో మరో జట్టును భారత్‌కు పిలిచి సిరీస్ ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల ప్రకారం శ్రీలంక అందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 1-15 మధ్య శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. దీనిని లంక బోర్డు కార్యదర్శి నిషాంత రణతుంగ ప్రాథమికంగా నిర్ధారించారు.