విశ్వాస కల్పనే లక్ష్యంగా..!
* చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని చర్చలు
* సరిహద్దు సమస్య, పీఓకేలో ఆర్థిక కారిడార్ నిర్మాణం,
* అరుణాచల్ ప్రదేశ్‌లను ప్రస్తావించిన మోదీ
* ఉగ్రవాదంపై పోరు, ఐరాస సంస్కరణలపై సహకారం
* పెట్టుబడులు, వాణిజ్య వృద్ధిపై సమాలోచనలు
* జిన్‌పింగ్ స్వస్థలం జియాన్‌లో మోదీకి ఘన స్వాగతం
జియాన్: చైనాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత పర్యటన మోదీ సొంత నగరం అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విధంగానే.. మోదీ చైనా పర్యటన జిన్‌పింగ్ స్వస్థలం ప్రాచీన నగరం జియాన్ నుంచి ప్రారంభం కావడం విశేషం. ప్రొటోకాల్‌ను కాదని బీజింగ్‌లో కాకుండా జియాన్‌లోని షాంజి గెస్ట్ హౌస్‌లో మోదీకి జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతకు బీజింగ్ వెలుపల స్వాగతం పలకడం తనకు తొలిసారని జిన్‌పింగ్ పేర్కొనగా.. అందుకు జిన్‌పింగ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం 125 కోట్ల భారతీయులకు చెందుతుందన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో తనకు లభించిన స్వాగతాన్ని జిన్‌పింగ్ జ్ఞాపకం చేసుకున్నారు. మోదీ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గత సెప్టెంబర్‌లో తన భారత పర్యటన అనంతరం ఇరుదేశాల సంబంధాల్లో విస్తృత స్థాయిలో పురోగతి కనిపిస్తోందన్నారు. మోదీ హిందీలో, జిన్‌పింగ్ చైనీస్ భాషలో సంభాషించారు. అనంతరం దాదాపు గంటన్నర పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. సౌహార్ద్ర వాతావరణంలో పరస్పర విశ్వాసం దృఢతరమయ్యే దిశగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ తెలిపారు. రాజకీయ, ఆర్థికాంశాలతో పాటు ఉగ్రవాదం, ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో సంస్కరణలు, అణు సరఫరా బృందంలో భారత్‌కు చోటు.. తదితర అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారని వెల్లడించారు. అనంతరం గురువారం రాత్రి వరకు మోదీ బీజింగ్ చేరుకున్నారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో శుక్రవారం విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు.
మోదీ, జిన్‌పింగ్ చర్చల్లోని ముఖ్యాంశాలు
- సరిహద్దు సమస్యపై, సరిహద్దులో శాంతిని నెలకొల్పే విషయంపై, ఇరుదేశాల్లోనూ ప్రవహిస్తున్న నదుల అంశంపై చర్చించారు. సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి బృందాలు ఇప్పటివరకు 18 సార్లు సమావేశమై చర్చలు జరిపాయి.
- పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్ అంశాన్ని లేవనెత్తిన మోదీ.. ఆ నిర్మాణంలో చైనా 4,600 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడాన్ని ప్రశ్నించారు.
- అరుణాచల్ ప్రదేశ్ వాసులకు స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడాన్ని కూడా మోదీ లేవనెత్తారని సమాచారం. అరుణాచల్ దక్షిణ టిబెట్‌కు చెందుతుందని చైనా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.
- ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాకు అనుకూలంగా ఉన్న దాదాపు 3,800 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు అంశంపై, ఆ లోటును తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యల విషయంపై చర్చించారు.
- రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతమయ్యేందుకు నెలకొల్పాల్సిన పెట్టుబడుల అనుకూల వాతావరణంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా మోదీ నేతృత్వంలో గుజరాత్ సాధించిన విజయాలను జిన్‌పింగ్ ప్రస్తావించగా.. ఆ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు మోదీ వివరించారు.
- బుధవారం నాటి కరాచీ దాడి, గురువారం నాటి కాబూల్ దాడులపై విచారం వ్యక్తం చేసిన నేతలు.. ఉగ్రవాదం అంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం అవసరమని నిర్ణయించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై తీర్మానం(సీసీఐటీ)పై చర్చలను త్వరగా ముగించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు.
- రెండు దేశాలు కలిసి పనిచేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఇరుదేశాల మధ్య అనుసంధానత పెంపు.. తదితరాలను చర్చించారు.
పగోడాకు కలసి వెళ్లి..
దక్షిణ జియాన్‌లోని ప్రఖ్యాత పగోడా ఆలయానికి మోదీని జిన్‌పింగ్ స్వయంగా తోడ్కొనివెళ్లారు. చైనాలో బౌద్ధం వ్యాప్తికి కృషి చేసిన ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి హుయెన్‌త్సాంగ్(జువాన్ జాంగ్ అనే పేరు కూడా ఉంది) స్మారకంగా ఐదంతస్తులతో క్రీశ 652లో ఆ బౌద్ధ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి బోధి మొక్కను మోదీ బహూకరించగా, బదులుగా, హుయన్‌త్సాంగ్ ప్రతిమను పగోడాలోని బౌద్ధ సన్యాసులు అందించారు.
అరుణాచల్, కశ్మీర్ లేని భారత్!
ఒకవైపు భారత ప్రధాని పర్యటన సాగుతుండగానే.. చైనా అధికార టెలివిజన్ చానల్ సీసీటీవీ ఒక దుశ్చర్యకు పాల్పడింది. ప్రధాని మోదీ పర్యటన వార్తలను ప్రసారం చేస్తూ.. జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లు లేని భారతదేశ పటాన్ని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
తాంగ్ వంశ సంప్రదాయ స్వాగతం
చైనాలోని అతి పురాతన గోడ ‘జియాన్ సిటీ వాల్’ సందర్శనకు వెళ్లిన మోదీకి అపూర్వ రీతిలో అద్భుత స్వాగతం లభించింది. ఆ చరిత్రాత్మక ప్రదేశంలోని ప్రాచీన సిటీగేట్ వద్ద తాంగ్ వంశ సంప్రదాయ రీతిలో భారత ప్రధానికి స్వాగతం పలికారు. జియాన్ సిటీ గోడ 40 అడుగుల ఎత్తుతో, 14 కిమీల పొడవుంటుంది. ఇక్కడ మోదీకి జిన్‌పింగ్ శాఖాహార విందును ఏర్పాటు చేశారు.