సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధం మరింత పటిష్టమవుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌లు భారత్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రకటించిన క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ ట్రంప్ దంపతుల పర్యటనపై వ్యాఖ్యానించింది. ట్రంప్ రాకతో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది.
ట్రంప్, మెలానియాలు భారత్ పర్యటనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్‌లో జరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు వర్గాల ప్రజలతో ముచ్చటిస్తారని వెల్లడించింది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని భావిస్తున్నారు. కాగా గత ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా రావాలని ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన హాజరు కాలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment