వూహాన్/వాషింగ్టన్/లండన్: చైనాలోని వూహాన్‌లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది. 10 రోజుల్లోగా మొత్తం పరీక్షలుచేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పరీక్షల నిర్వహణపై సమగ్ర ప్రణాళిక తమకు ఇంకా అందలేదని ఝోన్‌గాన్ ఆస్పత్రి డైరెక్టర్ పెంగ్ జియాంగ్ అన్నారు. అందరికీ పరీక్షల నిర్వహణ అంటే అత్యంత వ్యయంతో కూడుకున్నదని కోవిడ్ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకి, వారితో కాంటాక్ట్ అయిన వారికి, మెడికల్ సిబ్బంది, వయసు మీద పడిన వారికి పరీక్షలు చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ వస్తుందో లేదో: బోరిస్ జాన్సన్
కోవిడ్ వ్యాధిపై పోరాటం చేసి కోలుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వైరస్ రావడానికి ఏడాదైనా పట్టొచ్చని, పూర్తిగా రాకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ రాకపోయినా కోవిడ్‌తో పోరాటం చేయాలన్నారు. బ్రిటన్ ఆర్థికంగా కోలుకోవాలంటే భౌతిక దూరం పాటిస్తూ దశలవారీగా ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. ‘వ్యాక్సిన్ రావడానికి ఏడాది పట్టొచ్చు. లేదంటే అసలు రాకపోనూవచ్చు. వ్యాక్సిన్ రాదు అన్న దానికి సిద్ధపడే లాక్‌డౌన్ ఎత్తివేస్తూ సాధారణ జనజీవనానికి రావాలన్నారు.
రోజూ మూడు లక్షల పరీక్షలు: ట్రంప్
అమెరికాలో కోవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఈ వారంలో దేశం కోటిమందికి పరీక్షల నిర్వహణ పూర్తి అవుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 92 ల్యాబరెటరీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రోజుకి దాదాపు లక్షా 50 వేల పరీక్షలు నిర్వహించేది. ఇప్పుడు ప్రతీ రోజూ 3 లక్షలు నిర్వహిస్తోందని ట్రంప్ సోమవారం వెల్లడించారు. ఈ వారంలో కోటి మందికి పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. శ్వేత సౌధంలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం తప్పనిసరి చేశారు.
మహిళా విలేకరితో ట్రంప్ వాదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహిళా విలేకరిపై విరుచుకుపడి అర్ధంతరంగా సమావేశాన్ని ఆపి వెళ్లిపోయారు. సీబీఎస్ విలేకరి వీజే జియాంగ్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ మండిపడ్డారు. కరోనాతో వేలాది మంది మరణిస్తున్నా ప్రపంచంతో పోటీ పడేలా కరోనా పరీక్షలెందుకని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ట్రంప్ కరోనాతో అమెరికాలో మాత్రమే కాక ప్రపంచ దేశాల్లో ఎందరో మరణిస్తున్నారని, ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని, చైనాను అడగండని అన్నారు. జియాంగ్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు ఆమె కుటుంబం చైనా నుంచి అమెరికాకి వలస వచ్చింది. చైనాను అడగాలని తనతోనే ఎందుకు అంటున్నారని జియాంగ్ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment