ట్రంప్ మమ్మల్ని అసభ్యంగా తాకారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గతంలో తమను అసభ్యంగా తాకారని ముగ్గరు మహిళలు ఆరోపించారు. వారిలో ఒకరు తనను పెదవుల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పగా, మరొకరు చెప్పరాని చోట తాకారని అన్నారు. ఇంకొకరు తనను వెనక భాగంలో అసభ్యంగా నొక్కారన్నారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. మహిళలను అసభ్యంగా తాకడం గురించి ట్రంప్ 2005లో చెప్పిన మాటల వీడియో విడుదల అయిన తర్వాత ఈ ఆరోపణలు రావడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలను రెండో డిబేట్‌లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా విమర్శించారు. మహిళలను గతంలో వాళ్ల అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నారా అని ప్రశ్నించినపుడు ఆయన లేదని సమాధానం ఇచ్చారు. ట్రంప్ అనుచరులు కూడా తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించి.. అది ఆయన వ్యక్తిత్వ హననమే అవుతుందన్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను, ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినట్లు జెస్సికా లీడ్స్ అనే వ్యాపారవేత్త చెప్పారు. అప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా తాకారన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ను తీసేసి.. తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని, తన స్కర్టు మీద కూడా చెయ్యి వేశారని ఆమె అన్నారు. అతడు ఆక్టోపస్ లాంటివాడని, అతడి చేతులు అన్నిచోట్లా ఉన్నాయని ఆరోపించారు. అప్పటికి తన వయసు 38 ఏళ్లన్నారు. దాంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు.
రాషెల్ క్రూక్స్ (22) అనే మరో మహిళ 2005లో ట్రంప్ టవర్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారని, తనను తాను ఆయనకు పరిచయం చేసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వగా, ట్రంప్ ముందు బుగ్గల మీద, తర్వాత పెదాల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పారు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని, తాను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన కార్యాలయానికి వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు కావాలని అడగ్గా.. తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారన్నారు. తాను పనిచేసే బేరాక్ గ్రూప్ కంపెనీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా తాను చెప్పాల్సి వచ్చింది గానీ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు మాత్రం ఎప్పుడూ తనకు ఫోన్ చేయలేదన్నారు.
13 ఏళ్ల క్రితం ఒక రిసార్టులో తన పృష్టభాగంలో ట్రంప్ తనను అసభ్యంగా నొక్కారని మరో మహిళ ఆరోపించారు. మిండీ మెకగ్ గిల్లివ్రే (36) అనే మహిళ ఈ ఆరోపణలు చేశారు. అప్పట్లో తాను ఒక ఈవెంటు ఫొటోగ్రాఫర్‌తో కలిసి అక్కడకు వెళ్లానని, వెనక భాగంలో ఏదో ఇబ్బందిగా అనిపిస్తే తొలుత కెమెరా బ్యాగ్ తగిలందనుకున్నానని, కానీ వెనక్కి తిరిగి చూసి దిగ్భ్రాంతి చెందానని చెప్పారు.
అయితే... ఇప్పుడు ఆరోపణలు చేసిన మహిళలిద్దరిలో ఎవరూ ఘటనలు జరిగినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ట్రంప్ మాత్రం న్యూయార్క్ టైమ్స్ పత్రిక మీద పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కథనం అంతా అవాస్తవమని, ఆ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాసన్ మిల్లర్ మండిపడ్డారు. మహిళల ఆరోపణల గురించి తాము ప్రశ్నించిప్పుడు ట్రంప్ చాలా ఆవేశపడ్డారు తప్ప స్పందించలేదని పత్రిక ప్రతినిధులు వెల్లడించారు.