అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
న్యూయార్క్: అమెరికాలో ఉంటున్న భారతీయులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలో మాట్లాడకుండా ఉండటం ద్వారా దాడుల నుంచి బయటపడొచ్చని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సూచించింది. భారతీయులపై ముఖ్యంగా తెలుగువారిపై జాతి వివక్ష పూరిత దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు కొన్ని సలహాలు, సూచనలు, జాగ్రత్తలు టాటా చెప్పింది. ముఖ్యంగా భారతీయులు బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు మాతృభాషను తక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చింది.
ప్రస్తుతం అమెరికాలో సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటం మంచిదని జాగ్రత్తలు చెప్పింది. చుట్టుపక్కల అనుమానపూర్వక కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాలని, తమ చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను అంచనా వేయగలగాలని సూచించింది. వీలైనంత మేరకు ఎలాంటి వాదనలకు దిగొద్దని, బహిరంగ ప్రదేశాల్లో గొడవపడొద్దని, చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడాలని గట్టిగా చెప్పింది.
మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని కూడా సూచించింది. అత్యవసరం అనిపిస్తే 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దని కూడా సలహా ఇచ్చింది. ఇటీవల అమెరికా దుండగుడి కాల్పుల్లో ప్రాణాలుకోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల స్మృతి చిత్రంతో ఈ సలహాలు, సూచనలను టాటా సెక్రటరీ విక్రమ్ జంగం ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట