
డూమ్స్‌డే అపార్ట్‌మెంట్లు!
బెర్లిన్: రిచ్ రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు, కాసినోలు, మల్టీప్లెక్స్‌లు, ఈత కొలనులు, క్రీడా ప్రాంగణం లాంటి సకల సౌకర్యాలు కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అపార్టుమెంట్లను కాలిఫోర్నియాకు చెందిన వివోస్ కంపెనీ జర్మనీలోని రోతెన్‌స్టీన్ గ్రామంలో నిర్మిస్తోంది. అణు బాంబు పేలుళ్లు, ప్రమాదకరమైన రసాయనాలను, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాల లాంటి ప్రకృతి ప్రళయాలను సైతం తట్టుకొని ఈ అపార్టుమెంట్లు చెక్కు చెదరకుండా నిలవగలవని, ప్రజల ప్రాణాలకు ఎల్లవేళలా పూర్తి పూచికత్తును ఇవ్వగలవని ఈ అపార్టుమెంట్లను నిర్మిస్తున్న వివోస్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో రాబర్ట్ విసినో చెబుతున్నారు. ఎందుకంటే వీటిని అండర్ గ్రౌండ్‌లో నిర్మిస్తున్నారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అప్పటి సోవియట్ యూనియన్ నిర్మించిన అండర్ గ్రౌండ్ టన్నెళ్లను విస్తరించి 76 ఎకరాల స్థలంలో ఈ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నామని, ఇందులో ఒక్కో ఫ్లాట్ 2500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, వీటిని కొనుగోలు చేసే వ్యక్తుల అభిరుచులనుబట్టి ఫ్లాట్‌లో అంతర్గత మార్పులు చేసుకునే సౌకర్యం కూడా ఉందని రాబర్ట్ ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీటిని ‘డూమ్స్‌డే ఎస్కేప్’ అపార్ట్‌మెంట్లుగా పిలుస్తున్నారు. ఇందులోని నివాసితుల అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వాటర్ రీసైక్టింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. దాదాపు ఆరువేల మంది నివసించే సామర్థ్యంగల ఈ అపార్ట్‌మెంట్ల ఆవాసుల ఆవసరార్థం భూ ఉపరితలంపైనా ఓ ప్రత్యేక ఏర్పాటును ఏర్పాటు నిర్మిస్తున్నామని, చిన్న హెలీ కాప్టర్ల సౌకర్యం కూడా ఉంటుందని, సమీపంలోని రైల్వే స్టేషన్లకు బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
మొత్తం అపార్ట్‌మెంట్ల విలువ 67 వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పిన రాబర్ట్ ఒక్కో ప్లాట్ ఎంత ఖరీదు చేస్తుందో మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. ప్రకృతి విలయాలను, మానవ తప్పిదాల వల్ల కలిగే సకల ముప్పుల నుంచి మనుషులను రక్షించే భూగర్భ ఇళ్లను నిర్మించాలనే ఆలోచన తనకు 1980లో వచ్చిందని, అయితే అది ఎందుకు వచ్చిందో మాత్రం తెలియదని ఆయన చెప్పారు. ‘మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎటు నుంచి ప్రళయం ముంచుకొస్తుందో తెలియదు. అందుకని ఇలాంటి భూగర్భ అపార్ట్‌మెంట్లు ఎంతైన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నివసించేవారికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు సరిపోయే ఆహారం అందుబాటులో ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఒక్కో ఫ్లాట్ ఖరీదు ఎంతో ఆయన వెల్లడించనప్పటికీ అపర కుభేరులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందన్నది సుస్పష్టం.