
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment