
దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూసేశారు!
దుబాయ్ః అనుక్షణం ప్రయాణీకులతో హడావిడిగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్ట్ శనివారం మధ్యాహ్నం సుమారు గంటపాటు నిర్మానుష్యంగా మారింది. ఎయిర్ స్పేస్ లో ఓ అనధికార డ్రోన్ సంచారాన్ని గుర్తించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. గంటపాటు ఎయిర్ పోర్టును మూసివేశారు. అప్పటికే ఎన్నో విమానాలు గాల్లో ప్రయాణిస్తుండగా వాటిని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చినట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
శనివారం ఓ అనధికారిక డ్రోన్ తిరుగుతున్నట్లు గుర్తించిన దుబాయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు సుమారు గంటపాటు ఎయిర్ పోర్ట్ మూసివేశారు. ఉదయం 11.36 నిమిషాలనుంచి, మధ్యాహ్నం 12.45 వరకు దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఇటీవల రెండేళ్ళకాలంలో దుబాయ్ లో ఇలా జరగడం రెండోసారి అని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఓ ప్రకటనలో నివేదించింది. మొత్తం 69 నిమిషాలపాటు ఎయిర్ పోర్టు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా అనేక విమానాలు ఆలస్యం కావడంతోపాటు.. కొన్నింటిని దారి మరల్చాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించింది.
అనధికార డ్రోన్ కారణంగా అనేక విమానాలను దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చాల్సి వచ్చిందని దుబాయ్ ఎయిర్ పోర్టు ప్రతినిధి ఒకరు తెలిపారు. తిరగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి, వినియోగదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వాటాదారులతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తమకు భద్రతే మొదటి ప్రాధాన్యత అని, రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం విమానాశ్రయానికి, లేదా ల్యాండింగ్ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ, నిషేధిత పరిమిత ప్రాంతాల్లోనూ ప్రైవేటు కార్యకలాపాలకు, మానవ రహిత వాహనాలకు ఎట్టిపరిస్థితిలో అనుమతిలేదని ఎయిర్ పోర్ట్ ప్రకటనలో గుర్తుచేసింది.