చెంప చెళ్లుమనిపించిన చేప
సౌత్ వేల్స్: సౌత్ వేల్స్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అక్కడి సముద్రం ఒడ్డుకు వెళ్లి తుఫాను అనంతరం వాతావరణ పరిస్థితులపై కెమెరా ముందు నిల్చుని వ్యాఖ్యానిస్తున్న యూట్యూబ్ మహిళా ఉద్యోగిని చెంపను పెద్ద చేప వచ్చి వాయించింది. ఆ చేప దెబ్బకు ఆ మహిళ డామ్మని పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే 40 వేల మంది చూశారు.
క్రెయిగ్, ఎయిమీ అనే ఇద్దరు యూట్యూబ్ కోసం పనిచేస్తుంటారు. ఎప్పుడూ కొన్ని వీడియోలు చిత్రించి యూట్యూబ్లో పెడుతుంటారు. అందులో భాగంగా వారు తుఫాను వచ్చిన తర్వాత సౌత్ వేల్స్లోని బ్యారీ ఐలాండ్ బీచ్ వద్దకు కెమెరా తీసుకొని వెళ్లారు. క్రెయిగ్ కెమెరా ఆన్ చేసి చూస్తుండగా.. ఎయిమీ దాని ఎదురుగా వ్యాఖ్యానిస్తోంది. అదే సమయంలో ఓ భారీ అలా ఎగిసి ఆమెపై భారీ వర్షపు జల్లుగా పడింది. అప్పుడే ఆ అలలో ఓ పెద్ద చేప ఎగిరి వచ్చి ఆమె చెంపను బలంగా తాకింది. దీంతో ఎయిమి కిందపడింది.