ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్
న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ పేలింది.
సిగరెట్లు కాల్చే అలవాటు మానుకోవాలంటే ముందుగా ఈ-సిగరెట్లు అలవాటు చేసుకుంటారు కొంతమంది. ఇవి అంతగా ప్రమాదకరం కాకపోవడం, దుష్ప్రభావాలు లేకపోవడంతో పాటు.. దాదాపుగా సిగరెట్ తాగినంత మజా వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ.. న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ పేలింది. దాంతో అతడి కాలికి, చేతికి గాయాలయ్యాయి. ఉన్నట్టుండి ఏదో బాణసంచా కాల్పుల్లా తనకు అనిపించిందని, తీరా చూస్తే ఒక వ్యక్తి ప్యాంటులోంచి మంటలు రావడం చూశానని సెంట్రల్ సెల్లార్స్ ఉద్యోగి జాన్ లీ చెప్పారు.
బాధితుడిని వెంటనే ఒక ప్రైవేటు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అతడికి చిన్నపాటి గాయాలే అయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే దీనివల్ల అక్కడ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు. సాధారణంగా బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లకు మంటలు అంటవు. అప్పుడప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. ఈ సిగరెట్లు ప్యాక్ చేసుకుని ప్రయాణించడాన్ని నిషేధిస్తూ అమెరికా రవాణా గత సంవత్సరం ఓ నిబంధన విధించింది.