సాక్షి, హైదరాబాద్ : ఆదివారం రాత్రి జరుగనున్న కొత్త సంవత్సరం వేడుకుల నేపథ్యంలో నగరాన్ని జీరో యాక్సిండెంట్ నైట్‌గా చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రధాన సమస్య, ముప్పు అయిన డ్రంక్ అండ్ డ్రైవ్‌కు చెక్ చెప్పేందుకు ఆ రోజు రాత్రంతా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు డీసీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం వెల్లడించారు.
సాధారణ రోజుల్లో ఈ తనిఖీలు రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు మాత్రమే సాగుతాయి. అయితే డిసెంబర్ 31న దృష్టిలో పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని ఆదివారం 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు రంగనాథ్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దాదాపు ప్రతి వారాంతంలోనూ ఈ తనిఖీలు చేపడుతున్నారు. అయితే సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఠాణాల వారీగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్ టీమ్స్ తనిఖీలు చేస్తాయి.
ఆదివారం మాత్రం ఇలా ఒకేచోట ఉండి పనిచేసే స్టాటిక్ బృందాలతోపాటు నగరవ్యాప్తంగా సంచరిస్తూ అవసరమైనచోట ఆకస్మిక తనిఖీలు చేయడానికి అనువుగా మొబైల్ టీమ్స్‌ను.. వాహనచోదకుల్లో కలిసి సంచరిస్తూ, డ్రైవింగ్ చేస్తున్న మందుబాబుల్ని పట్టుకోవడానికి ఉద్దేశించిన డెకాయ్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద నగరవ్యాప్తంగా 100 బృందాలు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎవరైనా మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతూ చిక్కితే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తక్షణం వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment