
సాక్షి : ఊహించని విపత్తులు ఎదురైనప్పుడు స్పందించే సమయం కూడా మనిషికి దొరకదు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి ఎలాగైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవాలని చేసిన యత్నం వార్తల్లోకి ఎక్కింది. న్యూయార్క్ కు చెందిన ముహ్మద్ రమీరాజ్ (35)పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. కిందపడేసి కత్తిపోట్లతో అతని ఒళ్లంతా హూనం చేశారు. చివరకు ఓ కత్తిని అతన్ని గుండెల్లో దింపి పారిపోయారు.
అయితే ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో రమీరాజ్ లేచి నిల్చున్నాడు. రక్తం ధారలుగా కారుతున్నా.. ఏ మాత్రం ఆందోళన చెందకుండా ముందుకు నడవసాగాడు. ఆ పక్కనే ఐదుబ్లాకుల తరువాత ఉన్న క్వీన్స్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ముందు అతన్ని చూసి షాక్ తిన్న వైద్యులు.. వెంటనే కోలుకొని హుటాహుటిన అతనికి వైద్యమందించారు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. కత్తి చివర కొన గుండెకు తీవ్ర గాయం చేయటంతో అతను బతికే అవకాశాలు చాలా తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.
ఇంతలో పోలీసులు అతనిని కత్తితో పొడించింది ఎవరు? అన్న విషయం ఆరాతీసేందుకు సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. సోమవారం మక్‌నిష్ వీధిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.