‘భూమి గుండ్రంగా లేదు’ | earth is flat not round says a women research scholar | Sakshi
Sakshi News home page

‘భూమి గుండ్రంగా లేదు’

Published Wed, Jun 7 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

‘భూమి గుండ్రంగా లేదు’

‘భూమి గుండ్రంగా లేదు’

షార్జా: ‘ప్రపంచమంతా ఇంతకాలం భావిస్తున్నట్లు భూమి గుండ్రంగా లేదు. బల్లపరుపుగా ఉంది. కోపర్నికస్, కెప్లర్‌ చెప్పిన ఖగోళశాస్త్రమంతా తప్పు. సూర్యుడు చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం కూడా అబద్ధమే. విశాల విశ్వంలో గెలాక్సీ ఒక్కటే. గెలాక్సీకి సరిగ్గా మధ్యలో భూమి కదలకుండా నిశ్చలంగా ఉంది. భూమి వయస్సు కేవలం 3,500 సంవత్సరాలే. విశ్వం పుట్టుకకు కారణౖమైన బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతం కూడా తప్పు. అంతేకాదు, న్యూటన్, ఐన్‌స్టీన్‌ భౌతిక సూత్రాలు కూడా శుద్ధ తప్పు’ అని ఎవరైనా చెబితే పిచ్చో, వెర్రో అనుకుంటాం. బుద్ధి లేదా అంటూ  చెడామడా తిట్టేస్తాం!

 కానీ, ఈ సిద్ధాంతాన్ని తాజాగా ప్రతిపాదించినది ఓ యువతి. ఈ సిద్ధాంతం ద్వారా ఆమె ట్యునీషియా, అరబ్‌ ప్రపంచంలో పెద్ద సంచలనమే సృష్టించారు. ఆమెకు పిచ్చో, వెర్రో లేదు. పైపెచ్చు బాగా చదువుకుంది. పీజీలో ఫస్ట్‌ మార్కులు తెచ్చుకుంది. పీహెచ్‌డీ కోసం మాత్రం ఇదిగో ఇలాంటి ఓ పిచ్చి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆమె ప్రతిపాదించిన ఈ సరికొత్త సిద్ధాంతం తొలిభాగాన్ని ఇద్దరు ప్రొఫెసర్లు ఓకే కూడా చేశారు. ఆమె పూర్తి చేసిన ఈ సిద్ధాంతంలో ఇంకా ఎన్నో తప్పులు ఉన్నాయి. సూర్యుడు, భూ, చంద్రుల విస్తీర్ణాలు, దూరాలు తప్పే. ఈ సిద్ధాంతాన్ని యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఓకే చేయక ముందు, పూర్తిగా ప్రచురించకముందు బయటకు లీకవడం మంచిదైందని ‘అమెరికా యూనివర్శిటీ ఆఫ్‌ షార్జా’లో భౌతిక, ఖగోళశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిదాల్‌ గెస్సామ్‌ వ్యాఖ్యానించారు.

ఇస్లాం మత విశ్వాసాల ఆధారంగా ఆమె ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది తప్ప, ఏమాత్రం శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోలేదని ప్రొఫెసర్‌ గెస్సామ్‌ చెప్పారు. ఇటు మతం, అటు శాస్త్రం రెండు పవిత్రమైనవేనని, రెండింటిని కలపడం ద్వారా వాటి పవిత్రతను దెబ్బతీయ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భూమి, సూర్యుడిలో ఎవరు చుట్టూ ఎవరు తిరగరని, భూమి బల్లపరుపుగా ఉంటుందని రెండేళ్ల క్రితం సౌదీకి చెందిన ఓ మత గురువు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గెస్సామ్‌ ప్రస్తావించారు. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఖండించాలన్నారు. పీహెచ్‌డీ యువతి సిద్ధాంత పత్రంలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచురించారని అన్నారు.

‘ఫ్లాట్‌ ఎర్త్‌’ అని కొడితే యూట్యూబ్‌లో పది లక్షల వీడియోలు, వెబ్‌లో నాలుగు లక్షల పత్రాలు కనిపిస్తాయి. వాటిలో సగం భూమి బల్లపరుపుగా ఉన్నాయనే వాదిస్తాయి. ఇటీవల సోషల్‌ మీడియాలో కూడా ఇలాంటి వాదనలు రావడం పట్ల గెస్సామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement