మెక్సికో సిటీ: మెక్సికోను భూకంపం మరోసారి వణికించింది. ఇటీవలే రెండు శక్తిమంత భూకంపాలతో కుదేలైన ఆ దేశాన్ని శనివారం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో ప్రకంపనలు కలవరపాటుకు గురిచేశాయి. తాజా భూకంప కేంద్రం ఒవాక్సాకా రాష్ట్రంలోని మాటియాస్ రొమెరోకు 18 కి.మీ దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. గత వారం సంభవించిన భూకంప తదనంతర ప్రకంపనలే ఇవి అని తెలిపింది. తాజా భూకంపానికి భయపడి మెక్సికో సిటీలో వందలాది మంది ప్రజలు బయటికి పరుగులు పెట్టారు. ఇంటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఇద్దరు వృద్ధులు గుండెపోటుకు గురై మృతిచెందారు. గత భూకంప బాధితులను కాపాడేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒవాక్సాకాలో కూడా స్వల్పంగా నష్టం చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.