మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. దక్షిణ భాగంలో పెద్ద నగరమైన దావావోకు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైందని, అయితే సునామీ వచ్చే సూచనలేమీ లేవని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టంచేసింది. ప్రకంపనల ధాటికి పడాడా నగరం భారీగా దెబ్బతింది. కాగా భూకంపం సంభవించినప్పుడు ఆరేళ్ల చిన్నారి ఇంట్లో ఉండిపోయింది. భూ ప్రకంపనలకు భవనం కూలిపోవడంతో ఆమె మృతి చెందినట్లు ప్రావిన్స్ గవర్నర్ డగ్లస్ కాగాస్ తెలిపారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని మరణించిన ఆ చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
అలాగే పాడడలోని ఒక మార్కెట్లో భవనం కూలి ఇద్దరు మృతి చెందినట్లు ఫైర్ సర్వీస్ డైరెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ శామ్యూల్ టాడియో ధ్రువీకరించారు. ఇక భూకంపంతో
నగరంలోని ఆస్పత్రుల నుంచి రోగులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. పలు షాపింగ్ మాల్స్‌లోని ప్రజలు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. కూలిపోయిన భవనాల కింద ఉన్నవారిని అధికారులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా భూకంపంలో చిక్కుకున్నారని, అయితే గాయాలేమీ కాలేదని అధికారులు స్పష్టంచేశారు. దేశ ప్రథమ మహిళ కూడా ఆ సమయంలో ప్రయణంలో ఉన్నారని, అయితే ఆమెకూ ఏమీ కాలేదని తెలిపారు. ఫిలిప్పీన్స్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం మూలాన ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గత అక్టోబర్‌లో కూడా ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం తాకింది. మరోవైపు భూకంపం వచ్చినప్పుడు ఓ హోటల్‌లోని స్విమ్మింగ్ ఫూల్ నుంచి నీళ్లు బయటకు వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment