
కొనలేని కారు! అమ్మడానికి కాదట మరి!
ఓహో... కారు భలే ఉందే.. ఇది కూడా కరెంటుతోనే నడుస్తుంది... పర్యావరణానికి నష్టముండదు. అంతేనా? అనుకుంటున్నారా? రెండూ కరెక్టేగానీ... కొంచెం తేడా ఉంది. అదేదో సినిమాలో ‘‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’’ అని ఓ పాటుంది కదా.. అలాగే ఈ కారు కూడా కొంచెం ‘ఉప్పు’తో నడుస్తుంది. అంతే! అర్థం కావడం లేదా? చాలా సింపుల్. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఉప్పు వాడాల్సి ఉంటుందన్నమాట! జర్మనీకి చెందిన నానో ఫ్లోసెల్ అనే కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తోంది. త్వరలో జరగనున్న జెనీవా ఇంటర్నేషనల్ మోటర్ షో లో ‘48వోల్ట్’ పేరుతో దీన్ని ప్రదర్శించనున్నారు. ఈ కారులో బ్యాటరీలు ఉండవు. ఫ్యుయల్‌సెల్స్ ఉంటాయి. ఉప్పు.. ఇతర రసాయనాలను అందిస్తున్నంత కాలం ఈ ఫ్యుయల్‌సెల్ కరెంటు తయారు చేస్తూ ఉంటుందన్నమాట. బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది.. రీఛార్జ్ చేసుకోవాలన్న ఝంఝాటం లేదు.
ఇక స్పీడ్, రేంజ్‌ల సంగతి చూద్దాం. రేసు కారు మాదిరిగానే ఇది చాలా స్పీడుగా అంటే గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రతి చక్రంలోనూ 140 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లు ఉంటాయి. నాలుగు చక్రాల ద్వారా అందే 760 హెచ్‌పీ సామర్థ్యంతో కేవలం 2.4 సెకన్లలో ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అతితక్కువ వోల్టేజీతోనే ఎక్కువ వేగంగా ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. నానో ఫ్లోసెల్ ఇప్పటికే రకరకాల ఇంధనాలతో పనిచేసే గ్రీన్‌కార్లు అనేకం తయారు చేసింది. వచ్చే నెలలో జరిగే మోటర్ షోలో ప్రదర్శించే ‘48వోల్ట్’ ధర వరల గురించి మాత్రం కంపెనీ ఏమీ చెప్పడం లేదు. ఈ కారు అమ్మకానికి కాదు అని కుండబద్దలు కొడుతోంది కూడా!