అంతరించే దశలో అరుదైన కుందేలు
లండన్: లావోస్, వియత్నాం అడవుల్లో నివసించే అరుదైన జాతికి చెందిన చారల కుందేలు ప్రస్తుతం అంతరించే దశలో ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అన్నామైట్ చారల కుందేలును పరిశోధకులు 1999లో గుర్తించారు. నాటినుంచి ఇప్పటివరకు ఇది చాలా తక్కువసార్లు మాత్రమే కనిపించింది. ఇటీవల దీన్ని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ) పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అరుదైన కుందేలు చరిత్రను తెలుసుకునేందుకు యూఈఏకు చెందిన సారా అనే పరిశోధకురాలు మూడు నెలలపాటు అధ్యయనం కొనసాగించింది. ఇతర కుందేళ్లతో పోల్చితే ఈ కుందేళ్లు జన్యుపరంగా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అయితే పెరిగిపోయిన జంతువుల వేట, అడవుల నిర్మూలన వల్ల ఇది అంతరించే ప్రమాదమున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అరుదైన జీవులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడింది.