
ఐరోపాకు వారసులే లేరా..!
సంతానం లేనివారే అనేక ఐరోపా దేశాలకు అధినేతలవుతున్నారు. ప్రజలూ పిల్లల్ని కనడం లేదు. అదే మాదిరిగా రాజకీయ నేతలు కూడా మా తరం బాగా బతికితే చాలు.. వారసులెందుకు? అనే ధోరణితో బతుకుతున్నారు. సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుందంటారు. 20కి పైగా ఐరోపా దేశాల్లో ఈ రేటు 2.1 దిగువకు పడిపోయింది. అమెరికా స్థానిక ప్రజల జనాభా పెరుగుదల రేటు ఉండాల్సినదాని కన్నా కాస్త తక్కువే. అయితే, ఇతర దేశాల నుంచి వలసలు వచ్చి స్థిరపడిన జనం సంతానోత్పత్తి రేటు బాగుండటంతో జనాభా సంక్షోభం అమెరికాను ఇప్పట్లో తాకదు. 2015లో గ్రీస్ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటి జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వృద్ధులు. రిటైరైన జనాభాకు దేశ ఆదాయంలో 17 శాతం పింఛన్ల రూపంలో చెల్లించడం కూడా దేశం దివాలా స్థితికి చేరేలా చేసింది.
యథా ప్రజా తథా రాజా!
పిల్లలు కనడానికి బద్ధకిస్తున్న ప్రజలు సంతానం లేని నాయకులనే ఎన్నుకుంటున్నారు! జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ వంటి పెద్ద, పారిశ్రామిక దేశాల ప్రభుత్వాధినేతలు ఏంజెలా మెర్కెల్, ఇమానియేల్ మాక్రాన్, థెరీసా మే, పావ్‌లో జెంటిలోని పిల్లల్ని కనలేదు. ఇంకా డచ్ ప్రధాని మార్క్ రుట్, స్వీడన్ ప్రధాని స్టీవెన్ లూఫ్వెన్, లగ్జెంబర్జ్ ప్రధాని జేవియర్ బెత్తెల్, స్కాట్లండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ జా క్లాడ్ జన్‌కర్ కూడా పిల్లలు లేని నేతలే. ఈ నేతలకు సంతానం లేకపోవడం వల్ల ఆయా వ్యక్తులకు నష్టమే కాక, ఐరోపా నాగరికతకు ఎనలేని హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా తల్లిదండ్రులకు భిన్నంగా పిల్లలు ప్రవర్తిస్తారు. పెద్దవాళ్లు చెప్పినట్టు నడుచుకోరు. పిల్లలు లేని నేతలకు ఇలాంటి అనుభవం లేకపోవడం పెద్ద లోటు అని జేమ్స్ మెక్‌ఫెర్సన్ అనే విశ్లేషకుడు ఇటీవల వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే పత్రికలో రాసిన వ్యాసంలో హెచ్చరించారు. ‘‘ ఓ వయసులో పేచీలు పెడుతూ సతాయించే పిల్లల అనుభవం లేని సంతానహీనులైన ప్రజానాయకులు జనాన్ని బుర్రలు లేని తెల్ల కాగితాలుగా భావిస్తారు. నేడు యూరప్‌లో పిల్లల్ని కనని కొందరు దేశాధినేతలు ఇతరుల సంతానం భవితవ్యాన్ని ప్రభావితం చేసే విధానాలు రూపొందించి అమలుచేస్తున్నారు’’ అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్రాచీన రోమ్ మాదిరిగా యూరప్ ‘పతనం’ తప్పదా?
పిల్లలు కని వారిని పెంచి పెద్దచేసే బాధ్యత తీసుకోవడానికి ఆధునిక తరం ఇష్టపడడం లేదని, వందలాది ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదుర్కొన్న ప్రాచీన రోమ్ సామ్రాజ్యం పతనమైందని ప్రఖ్యాత బ్రిటిష్ యూదు మతపెద్ద జోనాథన్ హెన్రీ శాక్స్ కిందటేడాది ఓ అవార్డు తీసుకుంటూ లండన్‌లో హెచ్చరించారు. సంతానం లేని కుటుంబ జీవితాలు చివరికి ఐరోపా సమాజం మరణానికి దారితీస్తాయని కూడా ఆయన హెచ్చరించారు. ‘‘ వర్తమానంలో సుఖపడాలనే ఒక్క అంశం మీదే ప్రజల దృష్టి నిలుస్తోంది. భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన త్యాగాలు చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు.’’ అని శాక్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వలసొచ్చే విదేశీయులను యూరప్ కలుపుకోలేదా?
ప్రస్తుతం ఐరోపా దేశాల ప్రజలు తమ అస్తిత్వాన్ని, తమ స్వరూప స్వభావాలను పూర్తిగా మరిచి సంక్షోభంలో మునిగి ఉన్నారని, ఈ స్థితిలో తమ దేశాల్లో కల్లోలాల వల్ల ఐరోపా దేశాల్లోకి వచ్చి పడుతున్న వలసదారులకు ఆశ్రయం ఇచ్చి, వారిని తమ సమాజాల్లో ఇముడ్చుకునే స్థితిలో లేరని డగ్లస్ మరి అనే బ్రిటిష్ సామాజిక శాస్తవేత్త ‘స్ట్రేంజ్ డెత్ ఆఫ్ యూరప్’ అనే పుస్తకంలో చెప్పారు. అయితే, ఈ విశ్లేషకుల ఆందోళనకు అర్థం లేదనేదే మెజారిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కొన్ని దేశాల ప్రభుత్వాధినేతలకు సంతానం లేకపోవచ్చు గానీ, పిల్లలున్న అత్యధిక ప్రజానీకం ఓటేసి వారిని గెలిపించారు. కేవలం పిల్లలు లేనంత మాత్రాన ఈ బడా నేతలకు ప్రజా సమస్యలపై సమగ్ర అవగాహన లేదనుకోవడం పొరపాటే. అదీగాక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఖాతరుచేయని నియంతల పాలనలో ఐరోపా దేశాలు లేవు.