
పారిస్: కరోనా వైరస్ కారణంగా యూరప్ లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 30 వేలకు చేరుకుంది. అందులో ఇటలీ, స్పెయిన్ లోనే అధికంగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం 4,58,601 కేసులకు గానూ 30,063 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క ఇటలీలోనే 12,428 మంది మరణించగా, స్పెయిన్ 8,189 మంది, ఫ్రాన్స్ లో 3,523 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 40 వేల మంది మరణించారు.
ఆయా దేశాల్లో..
స్పెయిన్ ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లను 20 శాతం పెంచింది. పదుల సంఖ్యలో హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్ సెంటర్లను కూడా ఆస్పత్రులుగా మలచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తగినన్ని ఐసీయూ యూనిట్లు లేకపోవడంతో పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతోంది. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ దేశాల్లోని మెడికల్ విద్యార్థులను, రిటైర్డ్ వైద్యులను, చివరకు విమానాల్లోని మెడికల్ సిబ్బందిని కూడా కరోనా రోగుల కోసం రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఇటలీలో 10 వేల మంది వైద్య సిబ్బందికి, 60 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది. మరోవైపు పారిస్ గత వారమే తమ ఆస్పత్రులలోని ఐసీయూ బలాన్ని రెండింతలు చేసింది. అవన్నీ కూడా రోగులతో నిండిపోయాయి.