
'ట్రంప్ మరో హిట్లర్.. నేను అతడికి ఓటెయ్యను'
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు రిపబ్లికన్ల నుంచి కూడా అనూహ్య మద్దతు పెరుగుతోంది. మరో రిపబ్లికన్ పార్టీ నేత, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్టీన్ టాడ్ వైట్మేన్ తన ఓటును హిల్లరీ క్లింటన్కే వేస్తానని చెప్పింది. హిల్లరీ ఖాతాలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని, అయితే, వాటిని అదిగమించి పరిపాలనకు ఆమె సిద్ధమైందని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఒక హిట్లర్ లాంటివాడని ఆమె ఆరోపించారు.
2005లో ఓ సందర్భంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మహిళలకు సంబంధించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి స్పందిస్తూ క్లింటన్ మాత్రమే అమెరికన్లకు ఉన్న ఏకైక ఛాయిస్ అన్నారు. ట్రంప్ ఓ హిట్లర్ లాంటివాడని, తాను మాత్రమే హిల్లరీకే ఓటు వేస్తానని బాహాటంగా చెప్పారు. ట్రంప్ గురించి ఆలోచిస్తే ఓ నియంతే గుర్తుకొస్తారని, ఆయనను ఎలాంటి నియంతలతోనైనా పోల్చేందుకు వెనుకాడబోమని విమర్శించారు.