మెట్రో స్టేషన్లలో పేలుళ్లు, 10మంది మృతి
మాస్కో: రష్యాలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. సెయింట్ పీటర్స్ బర్గ్ రైల్వేస్టేషన్ సమీపంలోని మెట్రో స్టేషన్‌లో పేలుళ్ల జరిగి పదిమంది దుర్మరణం చెందగా, మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ఎక్కడివారు అక్కడ భయంతో పరుగులు తీశారు. పేలుళ్లతో సుమారు పదిమంది ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. గాయపడినవారిలో చిన్నారులు ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని మూడు మెట్రో స్టేషన్లును మూసివేశారు. ఎనిమిది అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వెల్లడించింది. కాగా రష్యా ప్రధాని పుతిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్ బర్గ్ పర్యటనలో ఉన్నారు. పేలుళ్లు నేపథ్యంలో భద్రతా అధికారులతో పుతిన్ హుటాహుటీన సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
మృతులకు రష్యా ప్రధాని సంతాపం ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించి రష్యన్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. రైలులోనే దుండగులు బాంబులు అమర్చి దాడులకు పాల్పడివుంటారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. రైలులో అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు డెమాస్కస్‌లోని రష్యన్ ఎంబసీపై జీహాదీలు దాడి చేశారు.
భారత ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ మెట్రోరైల్ స్టేషన్‌పై ఉగ్రదాడి బాధాకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హృదయవిదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు.
Deeply saddened by the loss of lives in the blasts at St. Petersburg metro. Heartfelt condolences to the families of the victims.
— Narendra Modi (@narendramodi) 3 April 2017