ఫేస్ బుక్ లో నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్..!
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఐస్ బక్కెట్ ఛాలెంజ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచీ సెలబ్రిటీలవరకూ విస్తరించిపోయింది. దేశాలు దాటి ఎల్లలు లేని స్పందనతో దూసుకు పోయింది. ప్రతివారూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యేంత క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అటువంటి ఎన్నో ఛాలెంజ్ లు సామాజిక మాధ్యమంలో కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కొందరు ఛారిటీ కోసం, మరి కొందరు క్రేజ్ కోసం, ఇంకొందరు అధ్యయనాలకోసం ఇలా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ పేరిట సామాజిక మాధ్యమంలో యూజర్లను విరివిగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' ఫేస్ బుక్ లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పిల్లలు వద్దనుకునేవారికి ఇదో ప్రత్యేక వేదికయ్యింది.
మాతృత్వం ఓ వరం అనే రోజులు పోయాయి. తల్లిదండ్రులు భారం అనుకునే కాలం కూడా చెల్లిపోయింది. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దనుకునే యుగానికి చేరుకున్నాం. అందుకు ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రారంభమైన నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్ పెద్ద ఉదాహరణ. ఇందులో మహిళలు పిల్లలతో ఎలా ఆనందంగా ఉండగల్గుతున్నారో తెలుపుతూ ఫోటోలను పోస్ట్ చేయాలని, పిల్లలు లేనివారు కూడ అదే విధంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఈ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఈ కొత్త ఛాలెంజ్ పై కొందరు విమర్శకులు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేశారు. ఇటువంటి వాటివల్ల పిల్లలు లేనివారు, కలగని వారు బాధపడే అవకాశం ఉందని, ఇటువంటి ప్రయత్నం మంచిది కాదని సలహాలు కూడ ఇచ్చారు. అయితే మిగిలిన వారు మాత్రం ఇదో సరదా ప్రయత్నమని, ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకోకూడదని కొట్టి పారేశారు.
టీవీ షోల్లో కనిపించే మిసెస్ టేలర్.. తాను ప్రేమగా పెంచుకునే పిల్లితోపాటు... ఓ బాటిల్ వైన్, బాగా నిద్రపోతున్న ఐదు ఫోటోలను పోస్ట్ చేసి, ఇవి చూస్తే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు ఏం గుర్తుకు వస్తోంది అంటూ కామెంట్ పెట్టింది. తన పోస్ట్ కు 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' అని పేరు కూడ పెట్టింది. నేను స్వయంగా పోస్ట్ చేసిన నా ఐదు ఫోటోలు పిల్లలు లేకుండా నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుపుతాయని ఆమె చెప్పడం విశేషం. ఆమె ఫేస్ బుక్ పోస్ట్ కు 24 గంటల్లోనే లక్షా పదిహేనువేల లైక్ లు వచ్చాయి. దీనికి స్పందిస్తూ మరో మహిళ.. తన భర్తతో ఉన్న ఫోటోలతోపాటు, తమ ఇంట్లోని తెల్లని సోఫా, మరికొన్ని సన్నివేశాలను కూడ పోస్ట్ చేసి, వాటిపై కామెంట్ కూడ పెట్టింది. తన భర్త అంటే తనకెంతో ఇష్టమని, ఆరేళ్ళ తమ వివాహ జీవితం ఎంతో హాయిగా ఉందని, ఫ్యాన్సీ ప్రపంచంలో ఒకరికొకరుగా ఉండటం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. ఇలా ఎంతోమంది నాన్ మదర్ హుడ్ కు సపోర్ట్ చేయడం కనిపించింది. అయితే బెర్ట్ ఫోసిల్ అనే ఓ యూజర్ మాత్రం ఇదేకనుక అర్థవంతమైన ఛాలెంజ్ అని మీకనిపిస్తే... మీ పిల్లలు ఈ ఛాలెంజ్ లో భాగస్వాములు కాకుండా చూసుకోండి అంటూ చురక అంటించాడు.