మీడియా సంస్థలతో ఫేస్ బుక్ డీల్..!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... ప్రముఖ మీడియా సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. వందల కోట్ల విలువచేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. మీడియాలో ప్రత్యక్ష ప్రసారాల వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫేస్ బుక్ ప్రత్యక్షప్రసారంలో అందించే సేవలకోసం ఈ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ఫేస్ బుక్ యాజమాన్యం పలు మీడియా సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంది. సుమారు 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. దీనిద్వారా సామాజిక మాధ్యమంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ లో వినియోగదారులకు అందుబాటులో ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బజ్ ఫీడ్, ఎన్ వైటీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు అత్యధికంగా 67 కోట్ల, 32 లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది.