
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ,ఆటో కౌంటర్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ ఇంట్రా-డేలో 31,471 గరిష్టాన్ని, నిఫ్టీ 9209 గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 743 పాయింట్లు లేదా 2.4 శాతం ఎగిసిన సెన్సెక్స్ 31,380 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు లేదా 2.2 శాతం పెరిగి 9,187 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం అనుబంధ సంస్థ రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ 9.9 శాతం వాటాను 5.7 బిలియన్ డాలర్లకు (రూ. 43,574 కోట్లు) కొనుగోలు చేసిన తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.2 శాతం పెరిగి రూ.1,364కు చేరుకుంది.
ఒక టెక్ కంపెనీ మైనారిటీ వాటా కొనుగోలుకుసంబంధించి ఇదే అతిపెద్ద పెట్టుబడిగా నిలవడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనగోళ్లకు దారితీసింది. ఆటో షేర్లలో మారుతి సుజుకి, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్‌జీసీ 5 శాతం బలహీనపడి ఎక్కువగా నష్టపోయింది. ఇంకా పవర్‌గ్రిడ్, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి ఒక్కొక్కటి 2 శాతం వరకు పతనమయ్యాయి.