
లాస్‌ఏంజెలిస్: పిల్లలను చూడగానే చాలామంది ముద్దుగా వాళ్ల బుగ్గలను గిల్లేస్తారు. కుక్కపిల్లలు కనిపిస్తే ఇంకొందరు తమ సంతోషాన్ని ఆపుకోలేరు. ఇలాంటి ప్రవర్తనకు మనుషుల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ ప్రాంతంలో కలిగే స్పందనలే కారణమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ కేథరిన్ మాట్లాడుతూ.. ‘ముద్దులొలికే చిన్నారులు, బుజ్జి కుక్కపిల్లలు వంటివారిని చూసినప్పుడు మెదడులో కలిగే ఎలక్ట్రికల్ స్పందనల నమోదుకు ఎలక్ట్రోఫిజియాలజీ అనే పద్ధతిని ఉపయోగించాం.
పరిశోధనలో భాగంగా 18–40 సంవత్సరాల వయస్సు ఉన్న 54 మందికి తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి వేర్వేరు చిత్రాలను చూపించాం. మిగతా చిత్రాలతో పోల్చుకుంటే ముద్దులొలికే చిన్నారులు, కుక్క పిల్లల చిత్రాలను చూసినప్పుడు వీరి మెదడులోని రివార్డ్ సిస్టమ్ ప్రాంతంలో ఉద్దీపనల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్లే చిన్నారులను చూసినప్పుడు వెంటనే వారి బుగ్గలను గిల్లాలని అనిపిస్తుంది’ అని వెల్లడించారు. ఈ పరిశోధన ‘ఫ్రాంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరోసైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.